Saturday, March 25, 2017

జీవితమే ఒక మాయ


ఎప్పుడూ నీవు నా ముందే ఉన్నట్లు ఉండి
అంతలోనే సప్త సముద్రాల అవతల ఎక్కడో
ఎప్పుడూ చూసుకోనంత దూరం లో ఉన్నట్లుంటుంది.
కాళీ కడుపులో లుకలుకలాడుతూ
మెలికలు తిరిగిన పేగుల ఆరాటం ఆబలా
ప్రతిరోజూ పునరావృతమే నాకు ఈ మనఃస్థితి
ప్రతిమలా నీవు నన్నే చూస్తున్నట్లు
అక్కడ నక్షత్రాల సరసన తేలుతూ దేవకన్యలా
నవ్వుతూ ఉన్నట్లుంటుంది.
పెదాలు కదుపని మౌనం మాటలు ఆడుతూ
అయోమయం గా ఉంటుంది.
ఈ హృదయం ముక్కలు ముక్కలుగా
చించివేయబడినట్లు అణువణువులోనూ అసంతృప్తి
ఎద మదిల మధ్య తీవ్ర పెనుగులాట
ప్రతిరాత్రీ నేను నిదురిస్తూ
పిల్ల గాలిలా నీవు నా కలల్లోకి వచ్చి
మయూరిలా నాట్యమాడుతున్నట్లుంటుంది.  


అప్పుడు నిన్ను చూస్తూ .... నాలో ఆశ్చర్యం
అదో వింత మాయాజాలం
ఆలోచించగలననే విషయాన్నే మరిచిపోతూ నేను
ఆ క్షణంలో నా మస్తిష్కంలో నీవు తిష్టవేసినట్లు
నిన్నే కోరుకుంటుంది ఈ హృదయం
ప్రతిసారీ కొత్తగా ఆశపడుతూ ఉంటుంది.
అంతలోనే నిరాశపడుతుంటుంది.
అది చెడుగా ఎక్కడ మలుపు తిరుగుతుందో అని
భయం .... అందుకే ప్రస్తుతానికి
ఆలోచించడమే మానేస్తున్నాను.
ఆకాంక్షిస్తూ .... పరిస్థితులు అంత అపసవ్యంగా
అభప్రదంగా ముగియకపోవచ్చు అనుకుంటూ


Friday, March 24, 2017

ఓ మానసీ .... నిన్నే


నీవన్నావు ఒకనాడు 
నాతో ఉంటే బాగుంటుందని, ఉంటానని .... 
నన్నెంతో శ్రద్దగా చూసుకుంటానని .... కానీ 
నిజంగా నేనెదురుగా ఉన్నప్పుడు మాత్రం 
నా ఉనికిని గమనించని నీ ప్రవర్తన 
నాకొక పెద్ద చెంప పెట్టు
నేనే ఎంతగానో ప్రయత్నించాను 
నిన్ను ఆనందంగా ఉంచాలని .... వీలైనన్ని విధాల 
 కానీ నిష్ప్రయోజనం 
మనస్పూర్తిగా నీకు నాతో ఉండాలని లేనప్పుడు 
నేనుగా చెయ్యగలిగింది చెప్పగలిగిందీ ఏమీ లేక
అకారణంగా నా కన్నీరు వృధా అవుతుంది తప్ప 

ప్రతిరాత్రీ నిద్దురలోకి జారుతూ రేపైనా 
అంతా సజావుగా జరగాలనే ఆకాంక్షతో విశ్రమిస్తాను. 
మరునాడు, ఏదీ మారదు నీ నా దూరంలా ....
చివరికి నేను గ్రహించిందొక్కటే 
 మార్పు, మనశ్శాంతి అసాధ్యం అని నీతో

Thursday, March 23, 2017

ఇంత అర్ధరహితమా జీవితం


ఇక్కడ, ఈ ఒంటరి తనం చీకటి లో
ఈ దుఃఖము, ఉదాసీనత, వ్యాకులత 
నిశ్శబ్దం నిండిన గది
లేని ....
నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను వింటున్నాను
నిన్ను స్పర్శించాలని చూస్తున్నాను
చేతితో గాలిని స్పర్శిస్తూ
అది నువ్వే అని
ఈ హృదయం ఒంటరిగా
ఒంటరితనం అనుభూతిని పొందుతూ 

ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది
నా చుట్టూ ఎవ్వరూ లేరా అని
నన్ను నన్నుగా గుర్తించి
నాతో సహచరించే తోడు
ఎంత ప్రాదేయపడినా క్షమించని సమాజం
గాలి లేదు .... ఉక్కపోత,
ఏడుపురాదు .... నిర్లిప్తత జీవితం ఇంతేనా అని
ఖాళీ గా అస్తిత్వం శూన్యమా అని 


ఒకప్పుడు ఎప్పుడూ నీతోనే అని 
సంరక్షిస్తామన్నవారు ఎక్కడికి పోయారో 
ప్రాణంలో ప్రాణంగా ఉంటామన్నవారు
ఈ చీకటిలో ఒంటరిని చేసి నన్నిక్కడ
తపించి అలమటించి మౌనంగా విలపిస్తుంటే ....
ఇంతేనేమో జీవితం
దుఃఖ, ఉదాసీనతలతో  
వికటాట్టహాసం చేస్తూ ఎప్పుడూ

Saturday, March 18, 2017

కలల ఎడారిలో కన్నీటి సుడులు


తుప్పుపట్టిన ఇనుపరెక్కల
సీతాకోకచిలుకనులా
అందవిహీనుడ్నై ఆకర్షణారహితంగా  
దుమ్ము దూళిమయ
చీకటి ఆచ్ఛాదన రూప లక్షణ  
అనాగరికత దుస్తులు తొడుక్కుని
శ్వాస భారమైన నన్ను చూసి
నవ్వుకుంటుందేమో నా మానసి స్వర్గంలో

నాలో మానసిక తుఫానును సృష్టించి
నన్ను ఛిన్నభిన్నం చేసి
స్పష్టత ఏకాగ్రత నిండిన నిష్కల్మష
అమాయక ప్రవర్తనతో చేరువై 
తన ఆలోచనల బంధీనైన నన్ను
తన ప్రేమకు ఆజన్మ ఖైదీని
అశక్తుడ్ని చేసి వెళ్ళిపోయి  
నా ఆక్రోశం వినబడనంత దూరంగా 


ఇప్పుడు నేనో నిరుపయోగ వృక్షాన్ని
నా నిశ్చలస్థితిని భరించలేని
నా చేతులు శాఖలు ఆయుధాలుగా మారి
నేనో కర్మయోగిని 
భాషాశాస్త్ర భావనల వస్త్రధారిని
నా మానసి మనోఉద్విగ్న భావనలతో
ఈదుతూ ఉన్నాను జీవ సాగరాన్ని
పూర్తిగా విచ్ఛిన్నం అయిపోయి

నా మానసి ఉద్దేశ్యం కోరిక ఏమిటో
నేను ఎలా మారేనని అనుకుందో
ఆఖరి క్షణంలో ....
మార్పు జీవనం సాధ్య పడునని నాలో ....
నాకే తెలియని వణుకు
నా శరీరాన్ని కుదిపేస్తూ
చిక్కుకుపోతున్నాను .... తన గురించిన
అనంత ఆలోచనల కన్నీళ్ళ సుడిలో

Monday, March 13, 2017

ఏమౌతుందో అని
కోల్పోవాలని ఉంది ఈ అస్తిత్వాన్ని
నిన్ను కలవలేని జీవితాన్ని
ఇన్నినాళ్ళూ ఎదురు చూసి చూసి
అలసిపోయానని చెప్పాలనీ లేదు
కానీ .... అనిపిస్తుంది
జీవించాలని లేదని .... అగమ్యుడ్నై

విశ్రమించేవేళ ఎప్పుడూ
నిస్సహాయత విసుగు అనినిపిస్తుంటుంది.
ఒకవేళ అనాసక్తత పెరిగిందేమో అని ....
అలా అనుకోగానే ఉక్కిరిబిక్కిరౌతాను
జీవితమంతా విసృత ఆలోచనల అపసవ్యతల
అవశేషాలై మిగిలినట్లు .... ఉద్విగ్నుడ్నై

గొంతు గళముతో నా పొడి పెదాలపై
నీ పేరును కూడ పలుక్కుంటుంటాను
అమృతం అద్దిన అనుభూతిని పొందాలని
అది గరళమయమైనట్లై
నిలువునా చీల్చిన మరణానుభూతిని పొందుతుంటాను.
చివరి శ్వాసకై నిన్ను ప్రాదేయపడి
నీపై వాలిన నీరసజ్ఞాపకమై మిగులుతూ

అది అబద్ధమే ....
ఒకవేళ అన్నీ సజావుగానే అని
నమ్మబలికినా ....
లేదు నేను బాధ పడ్డం లేదు అని
అంతా సవ్యమే అని
ఎవరితోనైనా నేను ఒట్టేసి చెప్పినా
అది నవ్వుకోవాల్సిన అబద్ధమే

అదుకే ఈ అనురోధన, నేను మరణించినా
నాకోసం నువ్వు కన్నీరు కార్చొద్దు
బాధ పడొద్దు, ఒకవేళ అలా కాకపోతే
ఆ క్షణాల్ని ఊహించలేను ....
స్థిమిత పడలేను, రాజీ పడలేను.
ఈ ప్రపంచమంతా ఏకంగా మీదపడి .... ఎక్కడ
బ్రతికి బట్టకట్టనీయదో నిన్ను అని

Sunday, March 12, 2017

అపరిపూర్ణత


కళాత్మకమైన 
ఏ చిత్రమైనా చెబుతుంది 
శత సహస్త్ర అర్ధాలు

మనము అనే ఇద్దరిలో ఒకరిని 
కాలమే అయినా ఎవరైనా 
ఏకమైన మనలను .... చీల్చితే 


రెండు సగ భాగములుగా 

ఏ సగభాగమైనా 
ఏమని అంటుంది నీతో 

నా నా మనోభావనలు 
అస్తిత్వ, అపరిపక్వ 
అగమ్యతలను గురించి