Friday, August 30, 2013

అదే ప్రేమ!


ఏ సమయం లో, ఏ స్థలం లో ....
అది నిజం ప్రేమే అని తెలిసిందీ అంటే 
చెప్పడం కష్టం! 
అది ఒక ఆశ్చర్యకర ప్రమాదం! 
గుండె కొట్టుకుని, 
కళ్ళు మెరిసి, 
ఒక్కసారిగా శరీరం తేలికై ....
అన్నీ కోల్పోయానేమో అనిపించే లక్షణం! 
కోల్పోవడమే మేలనిపించిన క్షణం. అదే ప్రేమ!

నేను


ఒక
పక్షి ని కాను.
వల వేసి పట్టుకునేందుకు,
వస్తువును కాను.
వెల వేసి కొనుక్కునేందుకు,
నేను
ఒక స్వేచ్ఛా జీవిని,
ఒక స్వతంత్ర సంకల్పాన్ని ....
నేను
బ్రహ్మ సంకల్పాన్ని .... స్త్రీని.
ఆ ఆది శక్తి స్వరూపాన్ని.

నేను కాదు


నేను కాదు చెప్పాల్సింది. 
నీవు నన్ను ప్రేమిస్తున్నావని, 
కలిసి జీవించాలనుకుంటున్నావని.
నేను నిన్ను ఒక సంరక్షకుడ్ని లా,
ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నానని. 

ఏమీ అనుకోకేం! 
ఊహించని రీతిలో ఇప్పుడో అప్పుడో 
ఒక్కో క్షణం నేను, 
నీ అపరిమితమైన 
ఆకర్షణకు లోనౌతున్నందుకు

ఆత్రంగా నిన్ను దగ్గరకు లాక్కుని,
పెదవులపై పెదవుల్తో
అర్ధం కాని, అర్ధం లేని ....
ఊసుల గుసగుసలాడినట్లు
కలలు కంటుంన్నందుకు. 

నేను,
నా కనుచూపు మేర .... 
ఒక పవిత్ర బంధాన్ని
మన ప్రేమ విజయాన్ని,
స్వర్గాన్నే చూస్తున్నాను.

నిజం నెచ్చెలీ!
నా మదితో నీ మది పలికే మాటలు 
మన సాహచర్యం మధురిమలు 
పంచుకునేకొద్దీ, 
పెరిగే ప్రేమ వెలుగులే అవి. 

ప్రతి రోజూ, 
నీవు నాలోనే అని ....
నీవూ నన్ను ప్రేమిస్తున్నావని, 
చెప్పాల్సిందీ, 
మనసు విప్పాల్సిందీ నేను కాదు.

Tuesday, August 27, 2013

వేణుగోపాలుడ్ని నేను!


ఎక్కడో పుట్టి  
ఇంకెక్కడో పెరిగాను.  
ఒక అమ్మ కడుపులో రక్తపు ముద్దను.  
ఒక అమ్మ ఒడిలో వెన్నముద్దను. 
వేణుగోపాలుడ్ని నేను.
ఓ మహిళా 
నీవూ నాలానే 
జన్మించిన ఇంటిని వొదిలి,  
తెలియని ముంగిట్లో రంగులద్దావు! 
ఆ బ్రహ్మ కార్యానికి ఆలంబనయ్యావు.
నా ఇద్దరు అమ్మల్నీ నీలో చూస్తున్నా! 
అందుకే అడుగుతున్నా! 
ఓ అమ్మా! 
జన్మదినమని నాకు కేకులెట్టేస్తావేమో! 
నాకు నీ ప్రేమ, వెన్నముద్దే ముద్దు! 
ఓ మహిళా! 

Monday, August 26, 2013

మరి నీవో?



ఒక
మంచి మాట చెప్పాలని, 
గొంతు విప్పి పాడాలని అనిపిస్తుంది.

ఎందుకో
ఎవరి అనుమతీ కోరాలని అనిపించడం లేదు.

మనసు మాట విని,
మనసుపాట పాడాలని,
మనసుబాటలో నడవాలని అనిపిస్తుంది.

మరిచిపోలేను
జీవితం అనుభవం చెప్పిన పాటాల్ని.

ఎవరో వచ్చేవరకూ ఎదురుచూడరాదని,
సలహాలు సూచనలే వస్తాయి ఆరంభంలో ....
అదీ గమ్యాన్ని మార్చే దిశలోనే అని.

అందుకే ....
నన్ను నేను అభినందించుకుని
మనసు చెప్పిన మార్గంలో పయనించేందుకు సిద్దమయ్యా!

ఇప్పుడు,
నా మార్గం లో నా ధైర్యం నమ్మకమే నా ఆసరా
మరి నీకో?

జిజ్ఞాస


నాలోని జిజ్ఞాస
నన్నో విద్యావంతుడ్ని చేసి
నాకో ఉపాది
నాలో సమాజం దేశం పట్ల
సంరక్షణ బావాన్ని పెంచుతుంది!

అయితే ....

ఒక మహిళ లో జిజ్ఞాస
ఆమెను విద్యావంతురాల్ని చేస్తూ
సంసారము, పిల్లల బాధ్యత తో పాటు
ఒక తరం నడవడిక, మార్గదర్శకత
తన చేతుల్లోనే ఉందని గుర్తుచేస్తుంది!

ఆశ


ఆ రోజొస్తుందని,
ఒడ్డుల్లేని,
సరిహద్దుల్లేని,
జెండాలు ఎజెండాల్లేని,
ఒక నూతన సమాజం ఏర్పడాలని,
ప్రయాణపత్రం (పాస్ పోర్ట్) గా హృదయం ఉండుండాలని,
ఆశ,
ఆ రోజు రావాలని.

Saturday, August 24, 2013

ఒక పాట నీ కోసం

నేను, నీ కోసం 
ఒక అందమైన భావనను 
కవితలా రాయాలనుకుంటున్నాను. 
ఒక 
మనోహర, సుందర అనుభూతిలా 
ఒక పాటలా రాయాలనుకుంటున్నాను.
ఆ అక్షరాలు, ఆ పదాలే 
అసూయ చెందేంత అందంగా
ఒక మధుర మనోజ్ఞ సుందర భావాన్ని .... ఒక పాటలా 
నీ మది పొరల్లో 
నిక్షిప్తమైన జ్ఞాపకాల పరిమళాలు అస్వాదించేందుకు 
నీ మది, నీలోంచి 
రెక్కలమర్చుకుని గాలిలో ఈదుతూ 
గగనం లోకి 
సినిమాలో లా సాగి 
శూన్యంలోకి వెళ్ళి భూగోళాన్ని చూస్తున్నట్లు 
మానవాళిని కలల్లోకి నెట్టి 
విధ్యుద్ధీపాల చమక్కుల చీర కట్టుకున్న పట్టణాలు 
ఉద్యమాల బెడద లేని నిద్దుర లో 
ప్రశాంతంగా పవ్వళిస్తున్నట్లు చూస్తున్నట్లు ....
ఒక అందమైన వింత భావనను 
పాటలా రాయాలనుకుంటున్నాను.
కేవలం నీ కోసం 
నేను, ఆ అందమైన భావనను 
పాటను ఆలపించాలనీ అనుకుంటున్నాను. 
కానీ, నా గళం అంత సున్నితం కాదు. 
నా గానం గాంధర్వమూ కాదు. 
నా పలుకుల్లో వ్యంగత్వం కనిపించొచ్చు!
మరి ఓ వచనం లా 
కవులకు మాత్రమే అర్ధం అయ్యే ఒక కవిత లా 
ఒక ప్రేలాపన లా చదువుతూ ఉన్నట్లుండొచ్చు!
నేను, నీ కోసం 
ఒక మధుర మనోజ్ఞ సుందర భావనను 
పాటలా రాసి నీ ముందుంచాలనుకుంటున్నాను. 

Friday, August 23, 2013

గ్రహాంతరాలు తిరిగొద్దాం రా!


గగనానికి ఎగిరి
చంద్రుడితో కరచాలనం చేసి
నక్షత్రాలతో గొంతు కలిపి
వసంతరాగం ఆలపించాలని
ఆ గురుడు అంగారకుడు
వసంతాగమనాన్ని
ఎలా ఆదరించారో చూసిద్దామని.

పిల్లా!
ఈ మాటల
అతిశయోక్తుల మూటలు ....
నిజం చెబుతున్నా!
నీ ముద్దు పొందేందుకే,

నీవు పాడే
పాట ఊపిరి తో
నా గుండెను పూరించుకుని
అదే పాట అదే రాగం తో
పదే పదే పాడుకుంటూ
ఆశ, జీవితం ఆధారం నీవు గా
నిన్నే పూజించి, ఆరాధించేందుకే.

పిల్లా!
నిజం చెబుతున్నా!
ఈ మాటలన్నీ
నీవంటే ఎంతో ఇష్టమని
నిన్నే ప్రేమిస్తున్నానని చెప్పేందుకే.

నిన్ను నేను ప్రేమిస్తూనే ఉంటా!


ఇది ఇలానే జరుగుతుందని 
ముందే తెలిసినా 
మన జీవన బంధం చివరి పేజీలు 
ముందే చదివే అవకాశం వచ్చుండినా 
ఆనాడే నీ సాహచర్యానికి 
దూరంగా పారిపోగలిగి ఉండినా
నీతో భాగస్వామ్యం జీవితం 
నన్ను ఎంతగానో హర్ట్ చేస్తుందని తెలిసినా 
నా నిర్ణయం మార్చుకుని 
నిన్ను ప్రేమించడం మానేవాడ్ని కాదు. 

ఏది ఎలాజరిగినా 
భిన్నంగా మాత్రం జరిగేది కాదు. 
నీపై ప్రేమలొ నా భావనల్లో 
ఎలాంటి మార్పూ ఉండేది కాదు 
మరో ఆలోచన చేద్దామనే 
ఆలోచనలను దరి రానిచ్చేవాడ్ని కాదు. 
నా గుండె బ్రద్దలౌతుందని తెలిసినా .... 
నేను నిన్ను ప్రేమించే ఉండేవాడ్నే!
జీవిత చరమాంకం లో 
ఇప్పుడు వెనుదిరిగి చూస్తే 
ఓ తియ్యని బాధ ఓ చేదు అనుభవం 
ఎండిన నా నరాల నదుల్లో జ్ఞాపకాలై .... 
నిన్ను నన్నూ ఒకే ఫ్రేములో చూపిస్తూ 
ఒక్క క్షణం చిత్రమైన అనుభూతి! 

నిజం అభిమానవతీ! 
వారసత్వం అవసరం 
సొంత బిడ్డలే కానక్కర్లేదని
నన్ను కాదనుకుని 
వ్యక్తిత్వ సౌందర్యం పెంచుకుని  
అనాదను అడాప్ట్ చేసుకుని 
ఒంటరి జీవితాన్ని ఈడుస్తున్న నీకై 
నా కళ్ళలో అదే ఆసక్తి! 
నా మనోభావనల్లో 
అదే ప్రేమ, అదే గౌరవం! 
నిన్ను నిన్నుగా 
బాహువుల్లోకి లాక్కుని పొదువుకునే 
అదే ఆబ అదే ఆవేశం నాలో ....



Monday, August 19, 2013

ఈ రోజుల్లో


మనుషుల్లో 
అమాయికత్వము, 
త్రికరణశుద్ధి కనిపించడం లేదు. 
ఈ రోజుల్లో ....

అసత్యం, 
అసహజం, 
మనోవైకల్యం .... 
అధిక శాతం అందరిలో .... 

నేన్నిన్ను ప్రేమిస్తున్నా!



నిన్నే! నా వైపు చూడు .... సూటిగా
నా కళ్ళలో కట్టుకున్న గూడులో
ఒద్దికగా అమరిన నీ రూపం,
నీ పై నా ప్రేమను చూడు.

నిజం పిల్లా!
నేన్నిన్ను ప్రేమిస్తున్నాపురుషుడు ప్రకృతిని లా
ఒక పల్లెటూరబ్బాయిలా
మనసునిండా నిన్నే నింపుకున్నా!

నీ నవ్వును చూస్తూనే చెప్పగలను,
నన్నెన్నో జన్మలుగా తెలిసున్న పలుకరింపు,
పరామర్శ .... ఆ నవ్వులో ఉందని,
ఆహ్వానం భావన ఆ కళ్ళలో చూస్తున్నానని!

ఒక గొప్ప జంట మనం అని .... చెప్పుకుంటుంటే తెలిసింది.
నీకూ, నాకూ సన్నిహితులు, స్నేహితులు
చెవులు కొరుక్కుంటున్న .... గుసగుసల్లో
వారి మనోభావన విశ్లేషణ లో ....

నేను పరిపూర్ణంగా నీ ప్రేమలో పడ్డానని,
ఆలోచించాల్సింది, అర్ధం అయ్యేలా చెప్పి
నిన్ను జీవిత బాగస్వామిని చేసుకునే బాధ్యత నాదే అని
నీ దృష్టిలో .... నా మీద ఉంది సదభిప్రాయమే అని,

ఔనూ! వారనుకుంటున్నది నిజమేనా?
నీ మనసులో ఉంది నీ ప్రేమకు అర్హుడ్ని నేనేనా?
అన్నీ సానుకూలంగా జరుగుతూ పోతే
నీవూ నేనూ మనం ఔతామని చివరిగా తెలిసేది నాకేనా!

ఆలోచించే కొద్దీ నా అరచేతుల్లో చెమటలు
నా కాళ్ళూ చేతులు ఒణుకుతూ
నా గుండె బ్రద్దలు అవుతుందేమో అనిపిస్తుంది.
భిన్నంగా బలాన్నిచ్చే శక్తి నీ మనసుకు మాత్రమే ఉంది.

మనోహరీ .... నాకు నీ తోడు అవసరం
నా కోరిక నీ ప్రేమ సాహచర్యం!
చెప్పు పిల్లా! నీవూ .... ప్రేమలో పడ్డావని,
మనసారా ప్రేమించానని .... అదీ నన్నే అని,

నిజం పిల్లా! నీ, నా ప్రేమ అబద్దం అయితే ....
ఈ ఊపిరి ఆగిపోతుందనిపిస్తుంది.
ఈ జీవితానికి, ప్రాణానికి అర్ధం లేదనిపిస్తుంది.
మరి చెప్పవా పిల్లా! నీవు నన్ను ప్రేమిస్తున్నది నిజమేనని

Saturday, August 17, 2013

భూగోళం


ఇప్పుడే తెలిసింది, 
ఈ భూగొళం 
గుండ్రంగానే ఉందని .... 
వెలుగు, నీడ 
ఆనందం, బాధ 
ఆశ, ఆకాంక్ష ల 
చుట్టూ పరిబ్రమిస్తూ ....
ఉన్నచోటే నేను ఉన్నానని, 
ఇప్పుడే తెలిసింది. 
ప్రతి రోజూ మబ్బులు 
ఎక్కడో వర్షిస్తూనే ఉంటాయని, 

రేపటి లో 
జీవిస్తున్న నేడు లా ....
నేడు, ఈ దేశంలో 
రేపు, ఏ దేశంలోనో 
ఎన్ని సముద్రాలు దాటి, 
ఎంత ఎగిరినా ఎంత చూసినా  
ఈ భూమికి, సమాజానికి 
ఎంత ఉపయోగం .... నేను అని ప్రశ్నలు
ఎన్ని తపనలు, ఎంత తిరిగినా 
తిరిగి, తిరిగి 
బయలుదేరిన చోటుకే 
వస్తూ ఉన్నా! 
కొలవలేని కాలం దారం 
పట్టుకు వ్రేలాడుతూనే ఉన్నా!

అమ్మ ఒడిలో 
ఆడి పెరిగిన పసితనం 
బ్రతకడం కోసం 
మానవారణ్యంలో 
పరుగులు తీస్తూ .... నేను 
వేసిన అడుగులు కొన్నే గుర్తున్నాయి.  
పొరపాట్లు చేసి దిద్దుకున్న క్షణాలు అవి.
ఇప్పుడు జీవితం అంచుకు చేరాక 
వాడి రాలే వయసు లో 
ఈ ముసలి ప్రాణం కల మాత్రం
కూతురుకు కొడుకుగా 
పుట్టేందుకు సిద్దమై ఎదురుచూస్తూ .... 
ఈ భూమిని గుండ్రంగానే చూస్తున్నా!

Friday, August 16, 2013

వికసించిన గులాబి


ధరించిన
ఎర్ర గులాబీ మనసు, 
ముఖాన 
వికసించిన 
ఆ నవ్వు పరిమళం 
ఆ హృదయం 
ఆ కల....వరం నీకోసమే

భావన


ఒక గుండె భావన
.......
ఆ రోదనము,
బిగ్గరగా వినిపిస్తున్న ఆ నవ్వు
.......
మరొక
మనిషి
పగిలిన కల

Thursday, August 15, 2013

నీవేనా!


నీవు 
పరిచయం అయ్యేవరకూ
నేను 
కలనైనా కనలేదు. 
.......
ఎవరో 
హృదయ ద్వారాలు 
తెరుచుకుని 
నా ఆత్మను ముద్దాడుతారని. 

పిల్లా! నిన్నే ప్రేమిస్తున్నా!


అది ఒక నిజం. ఒక పాపం.
అది ఒక రహస్యం
నింగీ నేలా కలవడం 
నీరూ గడ్డి తగలడం
వెయ్యిన్నొక్క కారణాలు. 
పిల్లా! 
నిన్ను ప్రేమిస్తున్నా అనడానికి

నీవూ, నేనూ 
కౌగిట్లో ఒక్కటైనప్పుడు 
మనమధ్య 
ఎంత దగ్గరో అంత దూరం
ఓ లక్ష కారణాలు 
పిల్లా!
మనం ప్రేమలో పడ్డాం అనడానికి 

నాకు, నీ నవ్వంటే ప్రేమ 
నాకు నీవు కాల్ చేసినప్పుడు 
ఆ ఆనందం 
ఆకాశం అంచుల్ని తాకి 
20యేళ్ళ యౌవ్వనుడ్నౌతా!  
నాతోనే ఉంటా అని మాటిస్తే
నా మనసంతా నీదే అని నీకు రాసిస్తా! 

నాకు, 
నీ మృదు మందహాసం ఇష్టం 
ఎంతో ఇష్టం 
నీ సుగందాల కురులు 
నీ అచంచలమైన వ్యక్తిత్వం 
పిల్లా! నా అభిలాష
నా ఇష్టం నీవని నీకు చెప్పాలని.

పిల్లా! నీకు కూడా తెలుసు 
ఎరుపెక్కే నీ బుగ్గల సిగ్గు 
విసిరిన నీ ముద్దు 
నాకు ప్రాణం అని 
ఇంకా సవాలక్ష కారణాలున్నాయి.  
పిల్లా! తెలుసా 
నేనందుకే నీవంటే పడిచస్తానని


నిజమనుకున్నా?!


మంత్రముగ్దుడ్ని
ఆ రాత్రి 
ఆ ఆకాశం పందిరి కింద, 
వెన్నెల ప్రతిబింబించిన 
నీ కళ్ళలో ....
ఒక చిత్రమైన కాంతి 
మెరుపును చూసాను. 
నీవు పెదవులతో ముద్ది 
దొంగిలించాక 
బిత్తరపోయిన నా హృదయం  
మరిచిపోని క్షణాల రాత్రి అది! 
మది, ఎదకు దూరమైన ....
భావనల రాత్రి అది.

నీవు నటన లో 
జీవించావు .... అని తెలియక 
నిన్ను నిజం అనుకున్నాను. 
ఎందుకనో, 
అప్పుడు ఆ సమయం, 
నీ ఉద్దేశం, 
ఆ పారవశ్యం మాయ ....
నటన అయ్యుండొచ్చనే 
ఆలోచనే 
రానియ్యలేదు నాకు. 
నీ సంరక్షణలో నే 
నేను భద్రంగా ఉంటానేమో 
అనిపించిన క్షణాలు అవి.

నీ చేతి 
ప్రతి స్పర్శ తో, 
మంత్రించినట్లు అయి
నా మనసు 
నా మాట వినడం మాని. 
నీ ఆధీనంలోకి 
వెళ్ళిపోయిన లక్షణం అది. 
నీ పెదవి ముద్దు 
ఝలదరింపు నన్నల్లుకుపోయిన 
మాయ ప్రబావం అది! 
సున్నితము, చురుకు ....
నాజూకైన, 
నీ చేతి వేళ్ళ మృదు స్పర్శ 
వెచ్చదనానికి 
అస్తిత్వం కోల్పోయి 
ముగ్దుడ్ని అయిన క్షణాలు అవి.


Wednesday, August 14, 2013

ఆమె

ఆకాశం నుండి రాలింది
ఆమె
ఒక తార
రెక్కలు విరిగి
ఎగురలేక ...
ఇక

Monday, August 12, 2013

శూన్యంలో శబ్దం



మంచం పై వెల్లికిలా పడుకుని నేను ....
శూన్య మనస్కుడ్నై 
సున్నం పెచ్చులూడిన సీలింగ్ ను చూస్తూ ఉన్నా!
గుండె వేగంగా కొట్టుకుంటుంది.
నా శ్వాస నాకే వినిపిస్తుంది. 
నేను బ్రతికే ఉన్నాను అన్నట్లు,
అప్పుడే, 
ఈ టపటప చినుకులు 
ఈ హోరుగాలి  
కొన ఊపిరి ఇంటి వసారా 
కప్పు రేకులతో సమరం చేస్తున్న శబ్దం! 
వాతావరణం భయానకంగా 
రోడ్లమీద 
ఉద్యమాలతో పోటీపడుతూ 
ఎటు చూసినా అస్తవ్యస్తతే ....
ఔనూ! నా మనసుకు రోధించే స్వేచ్చ ఉందా అని,


Sunday, August 11, 2013

ప్రేమ ఒక దైవ కార్యం


నీ దృష్టిలో
నీ ప్రేమ ఒక గాందర్వం
ప్రేమ ఒక దైవ కార్యం
ఆకాశం నుంచి ఊడిపడ్డట్లు,
కారు మబ్బులు
వెతలు .... కన్నీటిని చీల్చుకుని
జీవన ఉపశమనమై
ప్రేమ
ఒక స్వచ్చత నిండిన మనస్సుతో 
ప్రేమ వైద్యుడై వస్తుందని మాత్రమే 
నీకు తెలుసు

ఇన్నాళ్ళూ జీవితం అంతా
పోరాడుతూనే ఉన్నావు.
జీవితంలో
అన్నీ సక్రమంగా జరగాలి, 
మార్గాలు సుగమం కావాలి .... అని,
ప్రేమించిన అతన్ని కలిసాక
జీవితం చైతన్యవంతం అయిన భావన
నీలో కలిగినట్లు
ఒక వింత చిలిపి ప్రేమ
సంరక్షణ ను
ప్రేమికుడ్లో చూస్తున్నట్లు అనిపిస్తుంది.

నీవు ప్రేమను
ఎన్నో జన్మలుగా
ప్రేమిస్తున్నట్లు 
ఎల్లప్పుడూ
ప్రేమ తోడుగానే ఉన్నట్లు
సిక్స్త్ సెన్స్ చెబుతుంది.
నీ వద్ద ఉన్న
నీవి అనుకున్న అన్నీ
ప్రేమ కోసం
ఆనందం కోసం
ప్రియతముని సాహచర్యం కోసం
దారపోసినట్లు ఏవో దృశ్యాలు .... రీల్ లా

అప్పుడే ఇష్టపడి
అప్పుడే భయపడుతున్నావు
ఎందుకో విశ్వసించడం లేదు నీవు ప్రేమను
కాళ్ళకు అడ్డుపడుతూ,
మనసుకు మెలికలు వేస్తూ,
స్వేచ్చకు దూరం చేస్తున్నావు.
ఒక్క మాటా మాట్లాడవు.
అన్నీ గుసగుసలే ఆ కళ్ళతో
ప్రియ నేస్తమా!
బేలతనం తగదు 
విశ్వసించు .... ప్రేమ లక్షణాన్ని 
నీ గుండె సురక్షితమే అని,

ఒక స్నేహితుడు లా
ప్రేమ
ఎప్పుడూ సన్నిహితుడే నీకు
ఆలోచించి చూడు!
నీ కళ్ళలో కృతజ్ఞతాభావం
మారుతున్న మనోగతం చూడగలను.
నిన్ను ప్రేమించినందుకు 
ప్రతిగా నీ ప్రేమను పొందాలని
ప్రేమకు పట్టింపు ఉండదని తెలుసా? 
నీవు ఎక్కడ, ఎలా ఉన్నా
నీ ఎదలో ఒక ప్రత్యేక బాగం
ఒక పవిత్ర భావన
తనయ్యుంటుందని ప్రేమకు తెలుసు!

Friday, August 9, 2013

చిత్రం!


లాప్ టాప్ స్క్రీన్ మీద 
నిలకడ లేని 
అక్షరాలు, పదాలు, చిత్రాలు 
ఇటునుంచి అటు 
అటునుంచి ఇటు పరుగులు తీస్తూ 
భావాలు ఏవో 
రూపుదిద్దుకుంటూ
అది ఒక చిత్రమైన అనుభూతి 
నేను కీ బోర్డును లా
సున్నితం గా నీ చేతీ వేళ్ళు స్పర్శిస్తూ

కుశలమేనా!


అనుకోకుండా
నీ  నుంచి వొచ్చిన 
ఈ పిలుపు 
నీ మనసు పలుకరింపు 
ఓ ఆనంద లహరి
.....
ఎన్నో యేళ్ళ తరువాత
నేను కోల్పోయిన నన్ను 
కనుగొనడంలో
ఉపకరించి .....
నీ జ్ఞాపకాల లో

నిశ్శబ్దం!


ఒకవేళ 
ఆ ఆకులు మాత్రమే 
అంత 
హరితము 
కాకుండా ఉండి ఉంటే 
నా లోని ప్రేమికుడి హృదయం 
కొద్దిగానైనా ఆనందించేది 
నీ మౌనం 
ఈ శూన్యం ని .... నేస్తమా!

నిన్నలో


మరో సారి 
నేను, 
నిన్ను గట్టిగా 
గుండెలకు హత్తుకున్నాను. 
ఇప్పుడు 
నిద్రలో కూడా 
నన్ను 
నా హృదయం 
పోగొట్టుకున్న ఆ క్షణాలు 
జ్ఞాపకాలు 
పాత గాయాలు .... మచ్చల్లా 
నిన్నలో నేను

Thursday, August 8, 2013

కాల్పనికత లో


నేను, నీవవ్వాలనే
ఉత్సుకత 
ఫాంటసీ లో చిక్కుకొని
క్షణం పాటు
వాస్తవికతకు దూరమై 
......
నీ బంధీనై 
శృంగార బానిసనై
నీ ఆత్మ తృప్తి కోసం .... నేను  

మాయ రోగం ( బెట్టింగ్ )


క్రీడా సామర్థ్యం మందగించి
ఆకాశంలో సూర్యుడు.
మేఘాలతో దాగుడుమూతలు ఆడుతున్నట్లు 
అస్పష్టత 
మన కళ్ళ ముందు. 
కేవలం నాటకం ....
ఆట లా
దీర్ఘకాలం వ్యాధి
ఓపిక లేని ఆ మ్యానుపులేషన్ బెట్టింగ్

Monday, August 5, 2013

పక్షులమైనా బావుణ్ణు!

అరవయ్యారేళ్ళ క్రితం
కొత్త గా వచ్చిందనుకుంటున్న
స్వాతంత్రం
ఈ బంగారు సింహాసనాల
ప్రజాస్వామ్యం
నడిరోడ్డు మీద .... ఎవరికి వారు
సొంత ఆస్తిలా వింత నిర్వచనాలతో
వేలం వేస్తున్న  
గాందీ అంబేడ్కర్ ల భావనలు
భూతం భూతద్దంలోంచి ముందుకు చూస్తే
ఆశ్చర్యం వేస్తుంది
మనిషి వీధుల్లో స్వేచ్చగా
విహరించే రోజొకటి ఉందా అని


Sunday, August 4, 2013

అతను ఆమె


ఎవరి ఇబ్బందుల్నీ పట్టించుకోని 
మొండి 
సోడా కలుపుకోకుండా విస్కీ తాగుతూ 
ప్రతి రోజూ 
ఎవరో ఒకరితో గొడవ పెట్టుకుంటు 
అతను 
అనుకున్నది జరిపించుకుంటుంటాడు!
అందరిలోనూ మంచినే చూసే 
ఒక మంచి అమ్మాయి .... ఆమె
ఆమె మార్గంలో ....
అడ్డొచ్చాడు ఒకరోజు అతను
ఆమె నవ్వుతూ పలుకరించింది. 
అలా పేరుతో పిలవడం  
ఒక చిత్రమైన అనుభూతి అతనికి 
ఆ క్షణం ఆ ఉదయం నుంచి
మళ్ళీ పుట్టిన .... సూర్యోదయం భావన 
ఆమె ముఖంలోకి చూస్తూనే ఉండాలనిపిస్తూ 
ఆ క్షణం నుంచే 
వినూత్న పరిణామ క్రమం అతనిలో 

ఒక స్త్రీ కదలికల్లో, కళ్ళలో 
ఆమె నవ్వులో, ఆమె పలుకరింపులో 
ప్రకృతి సహజమైన ఆకర్షణ, వింత శక్తి 
నమ్మకం కలిగి పెరిగే .... ఒక కారణం 
కళ్ళ లోతుల్లో, ఆమె హృదయంలో ....
ఉండాల్సిన వ్యక్తిత్వం, విశిష్టత పొందేందుకు
ఎంతటి పురుషుడైనా దిగిరాక తప్పదు. 
అతను మారాడు. 
అతను పెంచి పోషించుకున్న ప్రవర్తన మారింది. 
అప్పటివరకూ 
ఆలోచనలన్నీ అతను, అతని ఎదుగుదల కోసం 
ఇప్పుడు సమాజం, దేశం కోసం 
మంచివాడ్ని అనిపించుకోవాలని 
ఆమె గుండెలో స్థానం స్థిరం చేసుకోవాలని 
వింత తపన, పట్టుదల .... 
ఆమె అతని హృదయాన్నీ స్పర్శించాలని 
............. 
ఆమె వైపు అతను చూసింది ఒక్క క్షణమే 
ఆ ఒక్క క్షణమే అతన్ని నిలువునా మార్చేసింది.
అతనికి ప్రేరణ అవసరమైన తోడు నీడ ఆమె అయినట్లు

కోరుకున్నది దొరకదెప్పుడూ



అతడిని నేను రిసెప్షన్ వద్ద చూశాను.
అతని చేతిలో వైన్ గ్లాస్
"ఔను, ఇప్పుడు నేను నరకానికి వెళ్ళాలి"
అతను తనలో తనే తడబడుతూ
గొణుక్కుంటున్నాడు.
అతను, అయిదున్నర అడుగుల సగటు మనిషి

అతను అంటూనే ఉన్నాడు
ఏది కావాలో తెలుసు. కానీ దొరకదు
దొరికింది .... ఎవరడిగారనో తెలియదు
అలా తెలిసీ దొరకని మాయే జీవితం
ప్రయత్నిస్తే ఏదో దొరుకుతుంది
ఆ దొరికిందే పొందాలనుకున్నానని అనుకుంటే
ఆనందం, ఉల్లాసం
అవసరం అయ్యిన్నాడే .... పొందామని తృప్తి.

Saturday, August 3, 2013

హృదయ స్పందన


ఇప్పుడూ, ఎప్పుడూ 
ఈ గుండె 
స్పందన నీవు.  
లక్షల మృదంగాలతో
గాందర్వమైన,
ఆకాశం పందిరి క్రింద ....
ప్రేమ జంట లా మనం.
మన ప్రేమ, 
ఒక పాటై ....
ఆలాపన అది.  
వారు పాడుతున్నారు.
"నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అని 
నా గుండె స్పందనలే సాక్షం అని, 
నీవూ గుర్తుతెచ్చుకో!  
ఓ .... ఆరాధ్య దేవతా! 
నా మనసు పాడిన 
మధుర గీతం ....
బృందావనంలో ఆనాడు
ఆ పూపొదల మాటున 
ఇప్పటికీ .... 
నీవు వినగలవు.  
నా గుండె 
సిరలు దమనుల్లో 
వేగంగా కదులుతున్న 
ఈ చైతన్యం, శ్వాస నీవు అని,

ప్రేమో ఏమో


నన్ను 
పిచ్చిగా గుద్దాలన్న కసి 
నీ ప్రవర్తనలో ....
నన్ను 
నీకు దూరంగా నెట్టెయ్యాలని 
పూనకం వచ్చినట్లు ప్రవర్తన.
మరోవైపు  
ఆ శరీరం మాత్రం 
దగ్గరకు లాక్కో అన్నట్లు 
పరివర్తిస్తుంది .... చిత్రంగా!

కోరిక


శోధిస్తున్నాను.  
నీ ఆత్మ అగాధాల 
చీకటి లోతుల్ని, 
నిజానికి, 
పంచుకుందామని 
హద్దుల్లేని ప్రేమను .... నీతో 

నెలరేడు


నన్ను ఉపశమనమించేందుకే 
ఆ గానం. 
అయినా, 
అది .... ఒక పాట లా ....
పాడు! 
శంఖం లాంటి, 
నీ గళం నుంచి విరజిమ్మిన .... 
ఆ వెన్నెల వెచ్చదనం ....
శబ్దతరంగాలై నన్ను తాకనీ! 
ఈ సూర్యోదయం వేళ 
నీవు వెళ్ళి పోయినా గుర్తుండిపోయేలా!

Friday, August 2, 2013

తొలి రోజు!


నాలిక కొర్రుక్కున్నాడు.
రక్తం
లాలాజలంలోకి స్రవిస్తూ,
అది .... తొలి రోజు అతనికి

నాటకీయం!


సాయంత్రం అరుపులు సర్దుమణిగి 
నక్షత్రాలు కళ్ళు విప్పార్చి చూస్తూ
కలలు తమంత తాము ఎగిరేందుకు సిద్ధమై 
అచైతన్యావస్థ లో వేళ్ళాడే శూన్యం 
గాలి గంటల సవ్వడి .... వైరుధ్యం శ్వాస 
వయస్సు ఎదుగుదల లో కుక్కేసి 
పెరుగుతూ ఆకాశాన్నంటుతున్న చెట్లు 
కాలం ఆడుతున్న నాటకం .... భూమి వేదిక గా 

సరి జోడీ!


ఆమె నా ముందు నా ఎదురుగా కూర్చొనుంది.
ఆమె నవ్వు అద్భుతం!
ఆ శంఖంలాంటి మెడ సాగి .... సుమధుర గళం.
ఆ కళ్ళలో తడి మెరుస్తూ, 
కళ్ళు మరల్చలేని ఆకర్షణ .... ఆమె.
ఆమె నావైపే చూస్తూ ఉంది. 
అదో వింత అనుభూతి! 
ఆమె నాకు సరి జోడీ .... ఔనా అనే ఆలోచనలు లోలో

ప్రియ ప్రేమ భావం


చైతన్యం, గానం, ఉత్సాహం .... ప్రేమ,
తనకు మాత్రమే .... చెవిలో 
ఏదో చెప్పాలనే తపన .... ప్రేమ,  
రహస్యం కాని 
చిన్న రహస్యం .... ప్రేమ
గుండెల్లో దాచుకోగలిగుండీ 
దాచుకోలేకపోతున్నావని తెలుసుకోవడం .... ప్రేమ,

చెడ్డ కల


మబ్బుల దుప్పట్లోంచి 
క్రిందికి 
జారి పడిపోతూ .... నక్షత్రాలు  
నా కలలు
నేను 
భద్రంగా దాచుకుంటున్నట్లు  
నీరులా .... 
అర్ధరాత్రి చీకటి
నా చెవుల్లోకి ప్రవహిస్తున్నట్లు
చిత్రంగా 
అక్కడే అణగారి పోయాయి 
అంతరాంతరాల్లో 
చెలరేగుతున్న నా భయాలు.

Thursday, August 1, 2013

ఆక్షేపణీయం .... నీవు ప్రియ నేస్తమా!


నన్ను నేను 
కడిగేసుకుంటున్నాను. 
నీ జ్ఞాపకాల ప్రియ భావనల గురుతుల్ని 
నా గుండె మీద ....
నీవు వదిలిన వేలిముద్రల మరకల్ని, 
శుభ్రంగా తుడిచేసుకుంటున్నాను. 
నాడు నా ఆత్మ పరితపించిన, 
నీ పాదముద్రల అద్దులు .... అవి.
అవి ఎవరికీ కనబడకుండా దాచుకునేందుకు, 
విశ్వ విఫల ప్రయత్నం చేస్తున్నాను. 

నిన్నటి నేను


నిన్నటి రోజున 
నేను నా నుంచి దూరంగా .... పారిపోయి, 
ప్రేమ సంపదను, ఆనందాన్నీ కోల్పోయాను.
అర్ధం కాని లక్షణం .... ఏదో 
పునరావృతమౌతుందేమో అనే 
భావన లో .... భయం తో
బాగా తెలిసిన 
ఆ అనుభవం నొప్పి నుండి విముక్తి కోసం
ప్రయత్నిస్తున్నాను. 
ప్రేమ నన్ను మళ్ళీ పట్టుకోలేనంత ....
వేగంగా, దూరంగా పారిపోవాలని,