Monday, July 28, 2014

తొందరెక్కువయ్యింది .... ప్రయాణానికి


నీడలా నన్ను వెంటాడుతూనే వుంది .... ఆమె
ప్రతి క్షణమూ ....

ఏ బలహీన క్షణాలలోనో 
నలు వైపుల్నుంచి నన్నల్లుకుపోయి,
రేపనే నా భవిష్యత్తును .... 

నాకు దూరం చేసేయాలని,

ఏవైపునుంచి వస్తుందో తెలియదు.
దాగుడుమూతలాడుతూ ఉంది.

శత్రువనుకోలేను.
నెచ్చెలి అనుకోలేను .... ఆమెను.


ఆ రోజు తప్పకుండా వస్తుంది
నా ఆశలు, కలలు, ఆరాటాలకు అంతం పలకాల్సిన రోజు.

ఆమెకు తెలుసు
ఆ సమయం కోసమే ఎదురుచూస్తుందామె
నా శ్వాసను ఆపేందుకు సిద్ధం గా ....

ఏ క్షణాన్నైనా ఆమె నన్ను పలుకరించొచ్చు
నాకు జీవన మోక్షమూ కలిగించొచ్చు!

అందుకే , ఈ లోగా ,
నా బాధ్యతలన్నీ నెరవేర్చుకునుందామనే
నాలో ఈ తొందర .....


నీడలా నన్ను వెంటాడుతూనే వుంది .... ఆమె

మరణం


ఇక పై దేనికీ భయపడనక్కరలేదని తెలుసుకోవడం.
ఏ చింత, నిస్పృహ లేని
ఎలాంటి సమస్యలూ లేని
ఏ తప్పు చెయ్యక్కరలేని 
నొప్పి లేని
రూపమే లేని
పాపపంకిలం కాని
శ్వాసించాల్సిన అవసరం లేని
ఏ పోరాటాలు ఆరాటాలు లేని సంపూర్ణ జీవితం అది 


జీవితం ఆఖరి అడుగేసాక,
ప్రతి ప్రాణి అనుభవంలో రాసి ఉన్న వాస్తవం ....

Saturday, July 26, 2014

తగదేమో



ఎవరైనా ....,
ప్రేమను జాగృతం చేసి
మనసును 
ఆటపట్టించి
శరీరాన్ని గిలిగింతలు పెట్టి 
సన్నిహితంగా మసలితే ....
ప్రేమే అనుకోవడం 
....??

Thursday, July 24, 2014

పరిమళాలలా జీవించేందుకు .... వస్తావా నాతో




కలలు నిన్ను కనికరించి,
నిద్దురలోనూ పరవసించి,
నీకు నీవుగా,
స్వేచ్చా విహంగానివి లా ఎగిరిపోయేలా ....,
విరిగిన నీ ఆశల రెక్కలు సరి చేస్తా,
ఆ గగన సీమలకు ఎగిరిపోదాం, .... వస్తావా నాతో?

మున్నెన్నడూ చూడని,
కలల లోకానికి,
కనపడని బాధల ఉపశమనానికి,
గాయాలు సమూలంగా మాయమయ్యే చోటుకు,
అంతా నీదే, అన్నీ నీవే అనిపించి,
స్వేచ్చగా పరుగులు తియ్యాలనిపించే
ఆ, బృందావనానికి .... వస్తావా నాతో ?

రాత్రిళ్ళను పగళ్ళుగా మార్చేస్తాను.
ఆ సూర్యుడ్నే నేనై .... నీ జీవితం లో,
భయమెరుగని ఉల్లాసోత్తేజాలతో,
ఆ గగనాన్ని చేరి చంద్రుడితో ముచ్చట్లాడి,
ఆ తారలతో ఎకసక్కాలాడే లా చూస్తా,
నీ కళ్ళలోకి చూస్తూ నేను పొందే తన్మయ భావన
నీలోనూ కలిగేలా చేస్తా, .... వస్తావా నాతో?


నా జీవన బంధపు బాంధవ్యానివై,
నేను అనే పందిరికి పూల తీగవై,
పరిమళానివై అల్లుకుపోతావా నన్ను?

చిత్రం గా


ఆమెలో నా ఆకలి తీర్చాలనే తహతహను 
అన్నపూర్ణను,
ఆ రాకతో రుచుల సంరంభాలను చూసాను.

శీతలతత్వం జిహ్వ చాపల్యమేదో అనుకున్నాను.
తడిపేస్తూ ఆమె నన్ను చల్లబర్చడం చూసి
ఆ అద్భుతం, ఆ మట్టివాసన ఎలా సాద్యపడిందో అని 

నిజంగా .... ఆ శీతలతత్వం నన్ను చల్లబర్చుతుందా?
మండు వెచ్చని వడ సెగలతో నేనామెను కాల్చేస్తానా? అనే
ఉరుము మెరుపుల ప్రశ్నల మీమాంస తో

ఆకలిగొన్న నా వెచ్చని శరీరం నుంచి
ఉబికుబికొస్తున్న లావా తాకి
ఆమె నోరు కాలి పోకపోవడం చూసాను.

సంసారానికీ సేద్యానికీ ఆవసరం అనుకోలేకపోయాను.
వసంతమై ఆమె, వేసవినైన నన్ను కలవడం 
ఋతు ఆగమనావశ్యకత అని సరిపెట్టుకోలేని స్థితి లో

Wednesday, July 23, 2014

సమతుల్యత



పరికించి చూస్తే, ఈ విశాల ప్రపంచంలో,
ఎన్ని అద్భుత ఆభరణాలో .... !
అన్నీ అమూల్య జీవనావసరాలే,

అంతటా ప్రాణవాయువు,
పైన అఖండ వెలుగుల భాస్కరుడు,
క్రింద నిత్యావసర నీరు,
మధ్యలో ఈ ఖగోళము,
ఆ సూర్యకిరణాల కాంతిలో,
రాశిపోసినట్లుగా రాశి చక్రాలు,
ఆ మేఘాల పందిరి,
ఇంద్రధనస్సు రంగుల ప్రకృతి ....
మనమెంత భాగ్యులమో కదా !

హాయిగా , సంతోషంగా జీవించేందుకు
కక్షలు, కార్పణ్యాలు,
ద్వేష, విద్వేషాలను .... వదలేసి.


ఎంతో కాలంగా



మల్లె తీగ తానై 
పెంచుకుంటున్న,
ఆ ఆశలు, ఆ కోరికలు,
నేను అనే .... పందిరి చుట్టూ,
అల్లుకుపోతూ,
నాతో కూడా చెప్పని,
ఆ భావనల తీగల అనురాగం,
నాలో ఏదో ప్రత్యేకత ఉందని కాదు ....
తనలోని ప్రత్యేకత అనీ కాదు ,
ఈ విశాల ప్రపంచంలో,
ఒకరి కొకరమై,
ఆనందంగా, ఆహ్లాదంగా,
కడదాకా జీవించాలనే.


Sunday, July 20, 2014

రోషపడ్డాను కనుకే .... చెబుతున్నా!


కథలు, కవితలు
కలలు
నిట్టుర్పులను రాయను .... నేనిక అని.

ఇప్పట్నుంచి
నీ స్పూర్తి
నీ ప్రభావం ఉండవు .... నాపై.

నా దినచర్యల్ని
నేనే చేసుకుపోతుంటాను.
నీ గురించి ఏ మాత్రమూ .... ఆలోచించకుండా,

అన్నీ నార్మల్ గా ....

తింటాను. తాగుతాను. తిరుగుతాను.
సినిమాలు చూస్తాను
ఆలోచిస్తాను, అందరిలా ....

నల్ల త్రాచులాంటి నీ కురులు,
నిండు తారల్లా మెరిసే నీ కళ్ళు,
ఆ చూపు అయస్కాంత శక్తి
నీవూ నేనే ఉన్నప్పుడు, గదిలో
ఒకప్పటిలా .... 

ఇప్పుడవి నన్నేమాత్రం ప్రభావితం చెయ్యలేవు,

ఎవ్వరూ చూడనప్పుడు ఆన్ లైన్ లో
చదరంగం ఆడుకుంటానే కాని,
మునుపటిలా, నీ కొంగుకు వ్రేలాడి ....
ఏవో తుంటరి భావనల్ని
గజిబిజిగా రాసుకుని మదిలో .... తరువాత
ఏ కవిత గానో కథగానో
నిన్ను కేంద్రబిందువును చేసి .... రాసుకోను.


నాకు నేను, ఎవరి తోడూ లేకుండా .... జీవించగలను.
నియమబద్దం గా .... 
సమయానికి పనికి వెళ్ళగలను.
పెళ్ళిచేసుకుని పిల్లల్ని కనగలను.
త్రాగి తినగలను.
సంపాదించిన డబ్బు ఆదా చెయ్యగలను మరణించేలోపు.

నేను చెబుతున్న ఈ చర్యలను
పాటించడం .... చాలా కష్టమని,
చెప్పినత సులభం కాదని
నిన్ను కోల్పోతానని తెలుసు.

ఊపిరాడని అధ్వాన్న స్థితే .... అయినా
నన్ను కాదనుకోవడాన్ని మించిన శిక్షని మాత్రం 

అనుకోను.

Saturday, July 19, 2014

సమీకరణాలు


నేను నమ్ముతాను ,
ఈ సమాజం ....
ప్రేమను, సహజీవనాన్ని నమ్ముతుందని,


ఆ నిజాన్ని మనం ఏనాడూ అంగీకరించకపోయినా
అనంగీకారాన్నీ మాత్రం తెలియపరచము

గంతలు కట్టుకునుండటం వల్లేనేమో,
కళ్ళముందు తరాజు లో ....సత్యం,
వాస్తవమే తూకపు రాయై నిలబడినా ....
అంగీకరించ(లే)ము దేన్నీ ....
సాక్ష్యం అవసరమని అంటూ.

ఉన్నది ఉన్నట్లుగా చూసే
అలవాటు .... లేదు మనకు.
కనీసం
అనంగీకారాన్నైనా అంగీకరించము.

అందుకే ....
ప్రేమ భావన తో ఒక సమావేశం
ఒక నిర్ణయం తీసుకుందామని
ప్రతిపాదిస్తున్నాను.

నేను అన్నింటినీ నమ్ముతాను.
అడ్డంకుల్ని అధిగమించేందుకు చేసే ప్రయత్నం లో
సహజీవన ప్రక్రియను,
ప్రేమ జీవనయానాన్ని నమ్ముతాను.

ఒకవేళ, ఎవరైనా నన్ను
నా లాగానే ఆలోచించినా ....లేక
అయోమయావస్థలో ఉన్నాననుకున్నా ....
ద్వేష భావనలను .... దరికి రానియ్యకుండా
ఆలోచించేందుకు సిద్దపడితే చాలనుకుంటాను .


గాయాలు,నొప్పి ల
దుర్ఘటనల ప్రపంచం లో
నివసిస్తున్నాము మనం

ఏ బాధనూ, ఏ సమస్యనూ ,
ఎన్నడూ తక్కువగా చూడలేము
అలా అని తలనూ వొంచలేము.


మన మురికివాడల నివాసాలను
ఆరోగ్యకర వాసయోగ్య ముంగిళ్ళుగా మార్చుకునే నేపధ్యం లో

ఓ నేస్తమా! నేను నమ్మేదొక్కటే
ఈ సమాజం
ప్రేమనూ, సహజీవనాన్నీ .... నమ్ముతుందని
అంతేకాదు. ప్రేమని, మానవత్వాన్ని, ఔదార్యాన్నీ ....
సామరస్య సంఘీభావాన్ని కూడా
నమ్ముతుందని నమ్ముదాం .

నేను నేనే


ఎగుడు, దిగుడు .... రాళ్ళూ, రప్పల బాట లో
నడుస్తూ ఉన్నాను.
పడుతూ, లేస్తూ
ఒక మధ్య తరగతి మనిషిని
నేను నేను లా .... మంచీచెడులను
మది పుటల్లో అనుభవం జ్ఞాపకాలుగా రాసుకుంటూ,


ఒక ఉమ్మడి కుటుంభం .... అమ్మ, నాన్న
అన్న, చెల్లి, తాత, బామ్మ
కానరాని వారి అడుగుల జాడల .... కట్టుబాట్ల లో
ప్రకృతిని పరామర్శిస్తూ
జీవనయానం సాగిస్తూ
అదే పురోగమనమని భావిస్తూ ఉన్నాను.

ఈ రాత్రి .... ఈ చిమ్మ చీకటి లో
అపసవ్యతలను చూడలేకపోయినా
నక్షత్రాల కాంతి ఆసరా తో స్పష్టం గా, వాస్తవాల్ని
పరిసరాల్ని చూడగలుగుతున్నాను.
మఱి ఉమ్మడి సమజం లో సహ భాగస్వామిని కదా!


ఆ నేను .... నేనే.

Friday, July 18, 2014

పరిపూర్ణుడ్నయ్యానిప్పుడే




ఆమెలో సంపూర్ణతను చూసి
ఆమెతోనే నడుస్తూ వస్తున్నాను.
ఎన్నో యుగాలుగా
పరిపూర్ణ మానవుడ్నౌదామని

సమాజం ఉచ్చులో పీకలవరకూ ఇరుక్కుపోయి
కట్టుబాట్లే అని సర్దిచెప్పుకుని .... అందరితో పాటు నేనూ అని
ఎన్నో కుతంత్రాల దౌష్ట్యాల భారి నుండి
ఆమెను సంరక్షించుకుంటూ .... ఎన్నో సార్లు మరణించాను 




అన్ని సార్లూ మళ్ళీ పుట్టాను
ఆమె నీడనవ్వాలని 
ఆమెను అడిగాను .... ఒక్కసారి 
నన్ను చంపెయ్యరాదా ప్రియా అని,

నవ్వింది. చివరికి నన్నంగీకరించింది .... ఈ జన్మ లో
ఇరువురమూ కలిసి మరణించేందుకు 
దాంపత్యం సహజీవనసాంగత్యం
ఇప్పుడు బ్రహ్మత్వం పరిపూర్ణత పొందిన ఆనందం నాలో

స్వగతం లో




కానరాని చీకటి రూపాలు,
ఉద్వేగభరిత భావనలు
నా మదిలో ....
అనశ్వరంగా కదులుతూ

పరస్పరం ప్రశ్నలుగా మారి
సమన్వయలోపం తో
మృదువైన చర్మం పై
చెక్కిన శాసనాలై

ఈ తిరుగుబాటు మనస్సు కు
ఏవో ఆవేశం పలుకుల్ని
మనోభావనల నెమలి ఈక తో
కథో, కావ్యమో రాయాలని

తీపి కలల ప్రేమను
యౌవ్వనం శాశ్వతత్వం
బ్రమ
తొలిపలుకులుగా 




ధైర్యం, డాంబికం,
సొగసైన పదాల దిద్దుళ్ళతో
నిరాశా
నిస్పృహల సమాజంలో

చిక్కని చీకటి కమ్మిన వేళ
ఊహలు, బ్రమల జీవితాన్ని
అద్భుత .... నక్షత్రాల ఆకాశం లా చిత్రించి
సంభరపడాలని స్వగతం లో.


Wednesday, July 16, 2014

మనవి చెయ్యాలని .... మరోసారి




నా జీవితం పేజీల్లోకి చూసుకుంటూ
మసకేసిన జ్ఞాపకాల్లో
మసక మసకగా కనిపిస్తున్న నిన్నూ నన్నూ చూస్తున్నా!
ఎన్నో తెలియకుండా మ్యానేజ్ చేసినా
తెలిసేలా చేసిన కొన్ని పొరపాట్ల పరిణామాలతో,
ఎన్నిసార్లు నీ సహకరాన్ని పొందాల్సొచ్చిందో 
ఎన్నిసార్లు నాతో కలిసి నీవూ
దొరికిపోవడానికి కారణం అయ్యానో .... ఆఖరి క్షణాల్లో
గుర్తుకు తెచ్చుకుంటున్నా!
జీవితం ఇంతదూరం ఎలా ప్రయాణించానో
నా కళ్ళలో నీళ్ళతో రాసుకుంటున్నా సమాధానాల్ని.
నీవు నాకు ఎదురైన ప్రతిసారీ
నాకు ఎదురొచ్చే ఏదో వింత నూతనత్వం తో
గాల్లో తేలిపోతున్న భావన తో
ఎన్నిసార్లు ముందుకన్నా అతిగా నిన్ను కోరుకున్నానో .....
ఈ రాతిరి నాకు నిదురించాలనిపించడం లేదు.
కలలతో కాలాన్ని కాలక్షేపం చెయ్యాలనుకుంటున్నా.
ఈ క్షణం వరకూ చూసుకుంటే ఈ జీవితం లో
నాకు నీపై నున్న ప్రేమే .... ఆద్యంతమూ



జీవించాను. ప్రేమించాను.
నన్ను నేను కోల్పోయాను
ఎన్నో ప్రతికూలతలకు స్పందిస్తూ
నరకాన్ని చూశాను. స్వర్గాన్నీ చూశాను
అన్ని సమయాల్లోనూ .... నా తోడు నీడగా
నేను చెప్పని, నేను చెయ్యని
ఎన్నో సమస్యల సమాధానావిగా .... నీవే
ఈ రాతిరి నిన్ను చూడాలనుంది .... కలలోనైనా సరే
ప్రపంచాన్ని నానుంచి దూరం చెయ్యొద్దని అడగాలని
ఎంత నువ్వే నేనైనా .... ఈ ముఖంపై
ఆ విషాద చాయలు చెరిపెయ్యమని, నా చేజారిపోవద్దని
నేనూ నీ ప్రేమ రూపాన్నే అని .... మనవి చెయ్యాలని మరోసారి

Tuesday, July 15, 2014

తడిగుడ్డతో కొయ్యొద్దు .... గుండెను!?




కత్తి ఎంత పదునైనదైనా,
అది ఎంత లోతుగా దిగినా, కాలం తో మానొచ్చు
కానీ,
కొన్ని గాయాలు .... అంతే! వైద్యవృత్తికే సవాలై
పీడ, నీడలు లా .... కనిపిస్తాయే కాని.




గుండె లోతుల్లో ఏర్పడిన గాయం .... తీవ్రమై
గడ్డకట్టిన చలి శిలనైన .... నా ముందు,
భారమైన ఏవో బాధ భావనలను గుమ్మరించినట్లు
నీ మౌనం పలుకులు
ఎంత విద్వంసం సృష్టిస్తున్నాయో .... నా లో 

Saturday, July 12, 2014

తోడేళ్ళ నీతి....లా




ఏదో ఉంది ....
నేను చూడలేని ఏదో
నేను మాట్లాడలేని పదముల పరిబాష
వక్రీకృత
ఆత్మన్యూనతాభావన 



క్రూర,
ద్వేషపూరిత సమాజం లో
ప్రతిదీ
నన్ను
సజీవంగా తినెయ్యాలని చూస్తున్నట్లు
చావుకు చేరువ చేసే కోరికలే .... 
అన్నీ నాలో

Friday, July 11, 2014

రాజీ పడక తప్పట్లేదు


జారిపోతున్న కాలం అంచు మీద నడుస్తున్నాను.
నేడును, సూర్యోదయం చైతన్యాన్ని శోధిస్తూ,
సుదీర్ఘంగా,
లోతుగా
ఏదో అద్భుతం జరిగిపోవాలని మాత్రం కాదు.


వింత వింత మనోభావనల ఇంద్రధనస్సు రంగులు
గడ్డిపూల, అడవికుసుమాల పై పరావర్తనం చెంది
నా మనసు ఖాళీలను నింపుతున్న
ఆ గోరువెచ్చని ఉదయకిరణాల మంచుతో
శరీరాన్ని తడుపుతూ .... అపసృతులను దిద్దుకుందామని 

తొలిసారి .... ఆ రోజే
చిరునవ్వు తో మత్రమే పర్యాప్తం కాని
నీ తొలి కరచాలనం అందుకున్నాను.
బహుశ నీకూ గుర్తుండే ఉంటుంది.
ఇన్నాళ్ళూ నేను మరువని మరువలేని మధురానుభూతి

ఆ అనుభూతి నా హృదయం .... నా లో
లో లోతుల్లొకి జారిపోయినట్లయ్యి
ఆ తదుపరి శ్వాసను కోల్పోయి
కొట్టుకోవడం మానెయ్యడంతో కూడిన అలౌక్యానందం.
వింత కాని వింత వాస్తవం అది

నీ స్పర్శ లోని ఆ మృదుత్వం మహత్యం వెచ్చదనం
విధ్యుత్తులా నా అంతరాంతరాల్లోకి పాకి
జిత్తులమారి వింత ఆసక్తేదో నాలో ప్రబలిన క్షణాలవి
అర్ధంలేని కోరిక ఆరాటం ఏదో అవకాశం ఆలోచనల్లో
అలసట కలిగిన క్షణాలు అవి

ఆ క్షణం నా మదిని ఆవహించిన
ఆ భయాలను జయించాల్సొచ్చిన పోరాటం
నా మది లో తీవ్రస్థాయి ని చేరి
నాది తప్పుడు ప్రేమ కాదనే భావన నుంచి
నన్ను నేను లాక్కోవలసి రావడం లోని అనిశ్చితి ....

నా ఆత్మను,
నీ వాస్తవికత ముద్దాడినట్లు .... అంతలోనే
నేను నిన్ను గాడంగా కౌగిలించుకున్నట్లు
ఏ జన్మలోనో మౌనం గా నీవాడిన గుసగుసల తిట్లు
నా జ్ఞాపకాల్లో ఇరుక్కుని అప్పుడే వెలికివచ్చినట్లు

పక్కన నీవు లేకపోయినా
చల్ల గాలి లో
ఆ గాలికి కదిలిన ఆకుల చప్పుళ్ళలో
ఆ గుసగుసలు వినబడొచ్చనే జిజ్ఞాశ
నన్ను నిలకడ నిద్రకు దురం చేస్తూ

ఆ నిశ్శబ్ద గాత్రాల జ్ఞాపకాల నైరాశ్యం నుంచి
భద్రతావశ్యకత పెరిగే .... ఇప్పుడిలా
జారిపోయిన నిన్న అనే కాలం అంచుమీంచి
ఇప్పుడు నేను ఇక్కడ,
నెమ్మదిగా నేడు వైపు నడుస్తూ .... కాలం తో రాజీపడుతూ

Thursday, July 10, 2014

హైవే నిర్మాణం కోసం




కొంచెం సమయం తీసుకున్నా తప్పులేదనిపిస్తుంది.
సరైన రహదారిని నిర్మించుకునేందుకు
మంచి నడవడికకు ఆస్కారం పెంపొందించుకునేందుకు
ఆ బాటలో సమాజం కాకపోయినా నా వారసులైనా నడుచుకునేలా
నా వంతు కృషి నేను చేసాననే తృప్తి కోసం

ఓ నేస్తమా! తదేకంగా చూస్తున్నావు .... !? నీవూ కలిసొస్తావా?
ఈ సాగుతున్న జీవ సరళిలో, మనుగడ కోసం పోరాటం లో
కొన్ని క్షణాల ఆనందం సౌలభ్యం కోసం
తిమ్మిని బమ్మిని చేసైనా .... సౌఖర్యాలు పొందాలనుకునే
కృత్రిమ ఆనందమయ జీవనాన్ని వద్దనుకుని .... అయితే సరే

స్పీడ్ బ్రేకర్స్ లేని రహదారి నిర్మాణం నేపద్యం లో
అవసరం .... నీకూ, నాకూ, ఈ సమాజానికీ, ప్రతి మనిషికీ మధ్య
ఆలోచనల అనుసందానం, మన కదలికల్లో లయ బద్దత
అందుకు, మరి కొన్నాళ్ళు ఆగాల్సొచ్చినా, మరి కొంత స్వేదించాల్సొచ్చినా
ఆ ఆశయం కోసం .... విశ్వాసంతో కదలడం అవసరం 



తప్పేమీ కాదు .... రేపటి పౌరుల జీవన సౌలభ్యం కోసం
జీవించడం .... కేవలం స్వార్ధం త్యజించడమే అనుకోవద్దు
కష్ట, త్యాగాల ఫలాల్ని గుమ్మరించడమే అనుకోవద్దు
వారసుల కోసం ఒక మంచి రహదారిని నిర్మించడం
బాద్యతే అనుకుందాం .... మన వంతు కృషి మనమే చేసి

Monday, July 7, 2014

వాగ్దానానికి విలువుంటుంది




పెదవి దాటిన వాగ్దానం ....
ఇచ్చిన మాట కు
ప్రాణం ఉంటే
ఆ పదం కృత్రిమ
ఖాళీ పదం గా పరిణమించదు.

మాటకు కట్టుబడేందుకే
నిర్ణయించుకున్న
ఒక ఆత్మ
తన వాక్కుకు
దైవత్వాన్ని చేకూర్చాలనుకోవడమే.

తేట తెల్లని వర్తమానం లో
జ్ఞాపకం లా కాక
నిన్ననే నిర్దేశించబడిన నేటి వాస్తవం లా
కర్మ శాసనాన్ని
కాలం గుండెలపై, పుట్టుమచ్చలా రాసినట్లు




ఆలోచనల పునఃసృష్టి ద్వారా
ప్రతి క్షణం
ఎవరో చేసిన ఏ వాగ్దానం యొక్క శబ్దతరంగాలో
కాల చక్రం ఇరుసు శబ్దం లో
నివసిస్తూ .... చరిత్రపుటల్లో సారమైనట్లు

ఒక్కటి మాత్రం నిజం ....
బీష్మ స్వచ్చత అవసరం
వాగ్దానమే అయినా ఒట్టే అయినా
అబద్దాల రాజకీయుల మాటలే అయితే ....
ఆ వాగ్దానం విలువెంతని?

నా జీవన వసంతం నీవు




నా నమ్మకం, నా కోరిక
నూతనత్వం దిశగా అడుగులెయ్యాలని
ఆశ ....
జీవితం లో ఒక కొత్త గృహం
ముంగిట్లో గొబ్బెమ్మలు .... ప్రామాణికంగా
నిద్దుర లేవాలని ....
ఎన్నాళ్ళుగానో
అరుదైన ఎదురుచూపుల కలలు.

ఎవరూహించగలరు?
జీవితం ఇలాగే మలుపు తిరిగి
నా కల నిజమౌతుందని.

నీస్పర్శానుభవం పొందిన క్షణానే
నాకు అర్ధం అయ్యింది.
నీ స్పర్శతో,
ఒక ఆకశ్మిక మందమారుతానివని,
సరికొత్త జీవన బాష్యానివని, 
స్వచ్చతవు ....
చిరునవ్వు పరిమళానివని, 
మధురభావ గీతికవని,
నా జీవితం లోకి ప్రవేశించేందుకే వచ్చావని   




ఆ క్షణం లో ....
నీవు నేను మాత్రమే శాశ్వతమై
కాలం స్తంభించిపోవాలని కలిగిన ఆలోచన
ఆ క్షణం కోసమే ఎన్నాళ్ళుగానో
హృదయం లో స్థానం శూన్యం లా ఉంచడమనే
భావన లోని సంకుచితత్వం
మది ఇబ్బందిగా మారి

నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని
చెప్పిన నాటి నుంచి
ప్రేమిస్తున్నదే నిజమే అయినా
ఎదురుచూస్తూ నీవూ నన్నే ప్రేమించాలనే
ఉద్దేశ్యం లో ఉన్న కారణం స్వార్ధం గా
ఎన్ని వసంతాలు వచ్చాయో
ఎన్ని శిశిరాలు పోయాయో
ఎన్ని అనుమానాలు, ఎన్ని ఆపోహలు
ఎన్ని స్వార్ధ బాష్యాలు
అన్నింటిలోనూ నీవే గమ్యం
నీకో ప్రత్యేకతుంచి నీ నీడ తోడుగా
కలిసి నడవాలనుకున్న నిర్ణయం వెనుక 
నా జీవన వసంతం నీవనే భావనేనేమో!?

Saturday, July 5, 2014

జీవితమంటే



జమీందారులు,
కోటీశ్వరులు గా పుట్టి కొందరు? 
కూడు, గూడు,
గుడ్డకోసం పరితపిస్తూ
అస్తికలు అస్థిత్వమే ఆస్తులు గా 
అనాదలు గా పుట్టి
కొందరు

ఎందుకో .... కొందరు
దొడ్డిదారుల్లోనే నడుస్తూ
ఎప్పుడూ ....
కొందరికేమో
సింహద్వారాల అట్టహాసాల స్వాగతాలు!

కొందరికి ఒకేచోట పడుకోవాల్సిన అవసరం లేదా?
అవకాశం లేదా!
ఆ రైల్వే ప్లాట్ఫాంస్
ఆ ఫుట్ పాత్ లు
ఆ మూసిన దుఖాణాల అరుగులే విశ్రామ స్థలాలు!

మాదక ద్రవ్యాలకు లొంగి
మద్యం లో తేలిపోయి ఎందరో ....
ఎందుకలా?
చదువుకున్న జ్ఞానులై
పురుగుల్లా పాకులాడుతుంటారు?

జీవితాన్ని
ఒక పాటం లా, ఒక యజ్ఞం లా
ఒక చరిత్రకెక్కాల్సిన అక్షరక్రమం లా
అంకిత భావం తో తపిస్తూ
కొందరు .... ఎందుకలా?



జీవితాన్ని
ఒక పొందిన అవకాశం లా
ఆనందం కోసం, అనుభూతి కోసం ఖర్చుచేసుకుని
ఒంటరిలక్ష్యం వైపు కదులుతూ 
కొందరికి ఆ తహతహ ఎందుకో?

వాస్తవాలను పరిశీలిస్తే .... జీవితం పాటశాల లో
కాలం రాసుకుపోతున్న అధ్యాయాల సమీక్షలో 
అప్పుడో ఇప్పుడో .... అందరమూ
కొందరు స్వల్పంగా
కొందరు పొరపాట్లు చేసేందుకే జీవిస్తున్నామనిపిస్తుంది.

ఈ అనుభవం పాటాలు
ముందు తరానికి మార్గదర్శకం గా
స్నేహ పరిమళాలు పరుచుకుంటుండుతూ 
ఆనందానుభూతిని చెందటం ....
జీవితం అనుకుంటే ఎలా ఉంటుందీ అని .... నాలో!?

వద్దనుకుంటున్నావని అనిపించాక .....


తొందరపాటు నిర్ణయాలు జీవితాల్ని సరిదిద్దలేవనే ....
నన్ను నేను మభ్యపెట్టుకోలేకే .... దూరంగా ఉందామనే ఈ నిర్ణయం 
పరిధులన్నింటినీ దాటి నిన్ను నీవు కోల్పోతావనే
నీలో ఏ మృధుత్వ ఆనంద పారవశ్యపు వెలుగులుండవనే
ఓ మహిళా .... నీది పసితనమనుకోనా? నీ నైజమే అది అనుకోనా?
ఏది ఏమైనా నీవు కోరుకున్నదే నీవు పొందడం న్యాయం
నీ ఆశలకు రూపమంటూ వొకటుంటే .... నిజం మహిళా! తుది నిర్ణయాధికారం నీదే!

కావాలనుకున్నంత మాత్రాన ఎవ్వరమూ ఏదీ పొందలేము.
ఏ స్త్రీనైనా ఆమెకై ఆమె కావాలనుకోనంతవరకూ
కళ్ళుండీ గుడ్డివాడిలా .... ముబావాన్ని, మౌనం అర్ధాంగీకారమనుకోలేను
బలవంతుడ్ని పరిస్థితులు నాకు సానుకూలంగా ఉన్నాయని,
నాకన్నా నీకన్నా బలమైనది ప్రేమ .... నిజం!
కోరుకోని ఎదను కోరుకోవడం .... స్వయంగా ఆత్మ ముందు దోషిగా నిలబడ్డమే


నీ మాటల్లో అయిష్టత లేదు. స్వాగతిస్తున్నట్లే ఉన్నాయి .... కానీ
ఆ చూపుల్లోనే, మాటల్లో చెప్పలేని అర్ధం కాని లోతైన భావనలేవో
నీ అవసరాలు, నిన్ను ఆవహించి ఉన్న సమశ్యలే అయ్యుండొచ్చు
మరిచిపోలేని దుస్థితి నాది .... నిన్న పందిరిమంచం వద్ద నీ ప్రవర్తన
బలహీనుడ్నైపోతున్నాను గుర్తుతెచ్చుకుని .... కొన్ని ఇష్టాలు అంతే
కోల్పోవాల్సొస్తుందనుకున్నప్పుడు బలహీనత అన్నివైపుల్నుంచీ ఆవహిస్తూ

మంచిరోజులొస్తాయని మంచికోసం ఎదురుచూడొచ్చనిపిస్తుందిప్పుడు
నన్ను నేను కోల్పోకపోతే ధీరుడ్నై నిలబడితే .... నిజం గా
పరిపూర్ణంగా చదవలేకపోయిన నీకు .... దూరంగా ఉండాలనుకుంటున్నా 
నీ మనసులో మరెవరూ లేరని తెలుసుకోగలిగే క్షణం వరకూ 
నిన్ను పొందేందుకు ఎదురుచూస్తూ ..... మనఃపూర్వకంగా
నిన్ను స్వాగతించేందుకు .... ఒక జీవిత కాలం పాటు .... ఓ మహిళా!

Friday, July 4, 2014

సంయమనం అవసరం




దేన్నైనా లోపరహితం అని
ఇదీ ఖచ్చితమైన జీవనసరళి అని
చెప్పలేము.
దేని వాస్తవికత దానిదే
జీవన యానం
బ్రతుకు రహదారి లో
నేనొక ఒంటరి బాటసారిని,
తోడుని అని
రహదారి నాకెలాంటి హామీ యివ్వదు.
నా సంరక్షణ బాధ్యత తనదే అని,

మనోలాలస ఏదో స్వార్ధ ప్రేరణ
ముందే ఊహించని ఏ కారణం వల్లో
నడుస్తుంది గతుకుల దారని
దగ్గర దారొకటుందని హ్రస్వదృష్టి తో
ఏ గులక, కంకర, బురద
చిక్కుల దగ్గర దారి లోనో, ఏ ఊబిలోనో
ఏ గుంటలోకో జారి, యిరుక్కుపోయి
బయటపడలేక పెనుగులాడుతూ,
జీవిత కాలం .... నిజం!
ఎవరి వాస్తవమైనా ఆ ఊబి, ఆ గుంటే 




ఆ నిజం నాకు అర్ధం అయ్యేసరికి 
ఒక జీవితకాలం పట్టింది.
లోపాలే లేని దారుండదని
ఎంత చెడు, ఖటినమైన మార్గం అయినా
సంయమనం తో నడుచుకోకతప్పదని.
జీవనయానం లో ఎవరి ఇష్టాయిష్టాలు
ప్రాధమికం కావని నేర్చుకున్నా .... పాటం
ఎప్పుడు వేగాన్ని పెంచాలో
ఎప్పుడు నెమ్మదిత్వాన్ని ప్రదర్శించాలో
నేర్పే రహదారే ఈ జీవితం అని.

మూల్యం చెల్లించాలి .... జీవించేందుకు




అంతరంగంలో లో లోపల
అంతా నేను లా
అగ(హ)పడుతూ ఉన్నా నేను

కానీ ఇప్పుడు,
ఇక్కడ సమాజం కట్టుబాట్ల నడుమ
పంజరం లో పక్షిలా.

జీవితం
జంతుప్రదర్శనశాల లా 
ఒక ఆటవిక న్యాయస్థానం

నా నుదుట చెరగని మచ్చలా
నా గుణం, నా పరపతి
పచ్చబొట్టు చిరునామాలా



అక్షరాలు
ఆయుధాలుగా వాడే
వింత మానవ జంతువును నేను

దూరంగా ఉండే నన్ను 

గమనించాలి అని
జాగ్రత్త! ప్రమాదం అని రాసి ఉంది.
దూరం దూరం అంటూ 
ఎవరో అరుస్తూ ఉన్నారు.

ఔనూ! ఎవరు ఆ అతను?

అతను నాకు ఒక అపరిచితుడే
కానీ దబాయిస్తున్నాడు.
నా నుంచి ఏమి ఆశిస్తున్నాడో?

అపరిచితుడైన అతనితో 
నేను రాజీ పడితే
జీవన యాత్రలో సంఘటితమైపోతే

అతన్నీ నన్నూ
అపరిచుతుల్ని చేసి
సమాజం బోనులో బంధీలను చేసేస్తుంది కదా!,


మూల్యం చెల్లించక తప్పదు జీవించేందుకు.