Wednesday, December 31, 2014

సహజగుణం


నిన్నటి
ఎదురుదెబ్బల అనుభవాలు
ఆనందపు అనుభూతులు
గాయాల్లా
గాయాలవల్ల ఏర్పడిన మచ్చల్లా
చెరగని గుర్తుల్లా
ఆత్మ ఆవిష్కరణలు లా
ఎద లోతుల్లో ....
అంతరంగం మూలల్లో
గాయం వల్ల ఏర్పడిన నొప్పిలా
నెమ్మదిగా,
మెల్లమెల్లగా కనుమరుగవుతూ 


ఔనూ!
నిజంగా ప్రేమ ఇంత ఖరీదైనదా?
ఆశ్చర్యం వేస్తుంది కదూ!
సాయం సంద్యా సమయం లో
ఒకప్పుడు
నాకోసం నీవూ, నీకోసం నేనూ
ఆ ఎదురుచూపుల వెంపర్లాటలు
ఆ విరిసిన చిరునవ్వు అత్తరులు
ఆ ఆనందహేళా కేళీ విహారాలు.
మరి ఎందుకో .... నేడు, ఈ నిర్లిప్తతలు
వడలిన పరిమళాలులా
మరుగున పడిపోతున్న ఆకర్షణలు
మార్పుకు కారణం కాలమేనా!?
నా, నీ మది ఎదల సహజ గుణమా!?

జీవన సంద్యాసమయం లో


కండ్లు చెదిరే కాంతిపుంజాలు,
కన్నీళ్ల బంధనాలు


జీవ సంద్రం మధ్య లో
ఎగసిపడే అలల
ఆశల్లా
లోలోతుకు లాగేసే సుడిగుండాల
లోతుల్లా

Tuesday, December 30, 2014

ఏమరిపాటనుకునేవు!?


మేలుకుంటే ఒకవేళ
ఏ వేకువజామునో
అకారణం గా పరితపిస్తుంటే
సహజమూ ఉలికిపాటే అనుకుని
జరిగిపోకేం!?
నీవు నమ్మాల్సిన నిజమొకటుంది. 


కలలోనూ .... నేనొక భగ్నప్రేమికుడ్నని
పొదరిళ్ళ తోటలో, వెన్నెలవేళల్లో
రాలిన పూపరిమళాల రేకుల్లో
తియ్యని అనుభూతుల్ని ఏరుకుంటూ
కన్నెర్రచేసిన కాలం పంజరం లో
చిక్కుకుని ఊపిరాడని
భావుక పావురాన్నని

Monday, December 29, 2014

చెలీ కుశలమా!?


నిన్నే అనుసరిస్తున్నాను
ఒక నీడలా
నీ దరిదాపుల్లో
నీ కనుచూపు మేరలో .... ఎప్పుడూ
ఏ కాలమూ
ఏ శక్తీ
నన్ను నీనుంచి దూరం చెయ్యలేనంతగా 
నీవే నా జీవన గమ్యానివి అన్నంతగా

నా ఈ లక్ష్యం
నీవు
నా హృదయాన్ని తాకిన క్షణం నుంచే
ఏ సముద్రాల లోతులూ
ఏ శిఖరాల ఎత్తులూ
అడ్డంకులు కాలేనంతగా
నన్ను దూరంగా ఉంచలేనంతగా
నీపట్ల ఈ ప్రియభావన  


నిన్ను ప్రేమించా
ప్రేమిస్తున్నా, ప్రేమిస్తా ....
ఎలా, ఎక్కడ ఉన్నా
ఏమైపోతావో అని 
ఎవరూ దూరంగా ఉంచలేనంత దగ్గరగా
నీతో, 
నీ నీడలా
నిన్నే అనుసరిస్తూ ....

నేనే నీవన్నట్లు
అడుగులో అడుగును లా 
నీడలా, నిజమైన శాశ్వత ప్రేమను లా
ఒక పరిమళాన్నై .... ఎప్పటికీ
పరిభ్రమిస్తూ .... నీ చుట్టూ
ఏ హిమాలయాల ఎత్తులూ
ఏ పసిఫిక్ మహాసముద్రాల లోతులూ
దూరంగా ఉంచలేనంత గాడంగా

Sunday, December 28, 2014

చిత్రంగా!


గుర్తుతెచ్చుకోమంటూ
నేనంటే ఎంత ప్రేమో నీకు అని

ఎవరో
బహుశ ఆ ఎవరో నీవే అనుకుంటా

గుసగుసలాడుతున్నట్లుంది.
నాకు అంత అత్యాశ లేదు అని అంటున్నట్లు

నీవెప్పుడూ నన్నిలానే ప్రేమిస్తూ ఉండకపోయినా
కానీ నీకు గుర్తుండిపోతే చాలని అనుకుంటున్నట్లు

నా పట్ల నీ ప్రేమ .... పదిలంగా ఉంటుందని,
గుర్తుంచుకుంటానని మాటిస్తావా .... అంటున్నట్లు

కన్నీళ్ళ పర్యంతం అయి
నా ప్రాణంలో ప్రాణం ఎవరోలా .... ఎదురుగా నీవున్నట్లు

నేను నేను కానట్లు ....
ఎక్కడో నాలో నన్ను కోల్పోయినట్లు

Saturday, December 20, 2014

వీడుకోలు


కూడగట్టుకున్నా!
కాసింత ధైర్యం విశ్వాసం ఈ ఉదయం,
తేరిపార చూసాక
ప్రశాంతతను నీ ముఖం పై
కప్పేసిన పూలమాలలు దాచేసిన జీవపరిమళాన్ని
ఆ రాలిన పువ్వులవెనుక మాయమైన నవ్వుల మెరుపులను
పారిపోయిన ఆ గలగలల నవ్వుల శబ్దాలను
నిజాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం
కానీ తప్పలేదు
నీ ఆత్మను ఎదురుచూస్తూ ఉండమనలేక.
వీడ్కోలు చెప్పక తప్పని సమయం
పిల్లా! బయలుదేరు నువ్విక స్వర్గానికి అనక
పోరాట విరమణ తప్పలేదు. 


కాలానిదా కన్నీటిదా తర్జన బర్జన 
ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో అనే పట్టింపులకు సమయం కాదు.
సెలవు తీసుకోవాల్సిన వయస్సులో
సూర్యోదయానికి ఎదురుగా మండుటెండలో
ముందుకు కదలాల్సిన స్థితి
కష్టాలన్నిటికీ మందు కాలమే అనుకుని
పురోగమించక తప్పని స్థితి
నీకు తెలుసా .... పిల్లా!
ప్రేమతో నీవూ నేనూ పంచుకున్న క్షణాలు
ఆ మధురానుభూతులు
కాలగతిలో ఏనాడో జారిపోయాయని.
అయినా ఇప్పుడు అంతరంగంలో నీ గొంతు
నా క్షేమాన్నే ఆకాంక్షిస్తూ .... మందలిస్తూ,
గర్వంగా ఉంది వింటున్నప్పుడు 
ఆనందంగా నీకు వీడ్కోలు పలుకుతున్నందుకు

Friday, December 19, 2014

ఎర్ర గులాబీ


ఒంటరి,
సోమరి జీవితం,
మరణం అంటే ఇష్టం
సాన్నిహిత్యం కన్నా
అదేమిటో? ఎందుకో?

సాహచర్యం
ఒక విలాసవంతమైన
బలహీనత
నేను భరించలేను అని
అనిపిస్తుందే కాని

రకరకాల అస్తిత్వాల
పెనుగులాటల
ప్రాభవం నుంచి
రక్షించుకోలేనేమో అని
నన్ను నేను

ఏ వ్యసనం
పోషనార్ధం
ఎవరి రక్తం చిందడానికి
ఇష్టపడుతున్నానో ....
ద్వేషం ముల్లునై


ఒక మొగ్గను
పువ్వునై ....
పరిమళించి, వడలి, రాలి
భావుకత్వపు అగాధం
లోతుల్లోకి జారిపోతుంటాను.

గాలికి నా అవశేషాలు
చెత్తలో దుమ్ములో దూళిలో
కలిసిపోతాయని తెలిసీ
మనిషి సాహచర్యం
భరించలేను, ఎందుకో

Thursday, December 18, 2014

పర్యవసానం కీడే అయితే


శూన్యత
క్షీణత
పరిణమించి పిచ్చితనం
తొక్కి అణిచివేయబడి ....
అస్తిత్వం
దుమ్ము లో దూళై
చిద్రమై ఆలోచనలు
మెదడు విభజన లా
ధ్రువీకరణ కోసం
వెర్రిగా
చేతులు తురుముతూ
తల
సన్నని గాలి
అక్షరాల .... అల్లికలు
సాలిగూడు అమరికలు
పదాలు, అరుపులు
మట్టిపురుగులు లా
మాంసం శరీరం త్రవ్వి ....
సలిపి గాయం
నొప్పి,
వ్యాపించి
పుర్రె ను
అనంత ఆవేదన
తేజరహిత
బాధరహిత
అస్తిత్వ అనాశక్తత

Friday, December 12, 2014

అమ్మాయాత్మనుకుని


కవి కవయిత్రుల
భావనల
అక్షర రూపాలు
పద పానీయాలు
పద్యాల శ్వాస
కవితల నులకమంచం
నిద్దురలో
పలువరింతలు

Wednesday, December 10, 2014

ప్రియ మానసీ ....



ప్రియ మానసీ! రాక్షసీ!! తెలుసుకో!!!
తెలుసుకో .... ప్రేమంటూ ఒక్కటుంది అని,
దానికి అర్ధం కేవలం నీవూ నేనే అని,
నిక్షిప్తమై .... నీకూ నాకూ మధ్య అది
అంతులేని నిధై ఉందని, 
ఆ నిధిని పొందేందుకే ....
నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని,
పొందాను కనుకే నిన్ను కోల్పో లేను అని,
దాచుకుంటానే కాని వొదులుకోలేను అని,
అంత అమితమైన ప్రేమ .... నాకు నీవంటే
నీవో ఉచ్ఛమైన గమ్యానివి .... నాకు
ఒక ఉదయించే కిరణానివి
ఒక కురిసే స్వేదపు చినుకువి.
పిచ్చివాడిని లా పరిభ్రమింపచేస్తున్నావు నన్ను
ఓ పిల్లా! పదే పదే .... నీపట్ల ప్రేమ నాలో
నీవూ ఒక్కసారి నిజమని చెప్పు .... నీ ప్రేమను
అసంబంధంగా ఏమీ చేయవని చెప్పవని తెలుసు.
గమనించి తీరాలి ఈ నిజాన్ని ....
నీపట్ల నాలో ఉన్న నా అపరిమిత ప్రేమను
ఒక్కసారి నా గుండె గుసగుసలు వినిచూడు
ఎవరూ లేని చోట
నీవూ నేనై కలిసి జీవించుదాం అని పలవరిస్తుంది.
నీ మనసు సౌలభ్యం వివరించు
ఎలా ప్రేమించాలో నిన్ను
ఆలోచిస్తాను అనుసరిస్తాను
అన్నివేళలా ....
నాకు తెలుసు నీకూ తెలుసని
నా మనోభావనలలో
ఎప్పటికీ నేను కోరుకుంటున్నది, నిన్నూ
నీ ప్రేమనే అని
నేను నీతో ఉన్న ప్రతిసారీ
నీ ప్రేమలో మునుగుతూ తేలుతుంటానని 
నిండుగా అని, మాటిస్తున్నానని .... ఓ పిల్లా!

Tuesday, December 9, 2014

అయితే


ఎవరూ నమ్మని ప్రియభావన
నీవూ నేనూ ప్రేమలో పడిపోవడం
ఒక్కరిమైపోవడం
ముందుగా ఊహించని విషయమే
నాలో నీ నివాసం నిజమై సహధర్మం కావడం
నీ చేరువతనం ప్రేమై, బంధమై నడిపిస్తుండటం
కొన్ని కొన్ని సమయాల్లో ఆశ, నమ్మకం కోల్పోయి
సొంతం నిజం కావాల్సి కాని
బహుమానల నిధులెన్నో .... అన్న
నిజం ఉదాహరణలమై 

అన్నీ వినూత్నం గా
కోరుకున్నట్లుగా
మళ్ళీ జన్మించిన భావన కలుగుతూ
చూస్తుండగలగడం
ఒకరిలో ఒకరు ఒకరికొకరమై
నా, నీ కళ్ళలో ప్రతిబింబిస్తున్న
అది చాలు .... అన్న సంతృప్తి భావన
ఆ భావన వెనుక ప్రేరణనిస్తూ ప్రేమ
పరిక్షలనెన్నో ఎదుర్కొని
పురోగమించేందుకు మార్గదర్శి లా 


ఏ ప్రేమ పోరాటం లో అయినా
గెలుపు ఒక ఆకస్మిక పరిణామమే
కలిసి జీవించేందుకు
కొంత స్వీయతను కోల్పోయేందుకు
నమ్మిన నిజాలు కొన్ని అబద్దాలైనా
సర్ధుకుని, సహకరించుకుని
ఆలోచనలలో వెసులుబాటు
ఆచరణలో సంయమనం ప్రదర్శించి
పురోగమిస్తే ....
అప్పుడు ప్రేమ ఎవరికైనా మార్గదర్శే

ఒంటరినే నేను


 సాహిత్యం రాయను.
రాసేందుకు
నేను రచయితను కాను.
ఇబ్బందిగా ఉంటుంది ....
వెటకారం లా అనిపిస్తుంది.
ప్రస్తుతిస్తే ....
ఎవరైనా అలా

నావి
కాలక్షేపపు రాతలు
ఏమీ తోచనప్పుడు,
ఒంటరిగా ఉన్నప్పుడు,
చెసేందుకు ఏమీలేనప్పుడు ....
ఒంటరిని అని
అనుకుంటున్నప్పుడు, 


ఎందరో అడిగారు.
నువ్వెలా
ఒంటరివి అవుతావు అని?
ఒంటరితనానికి
అర్ధం ఏమిటి అని?

చుట్టూ ఎవ్వరూ లేనంత మాత్రాన
ఒంటరిని అని అర్ధం కాదు.
ఎందరో చుట్టూ ఉండి,
ఎవరూ గుర్తించనట్లు,
అర్ధంచేసుకునే ప్రయత్నం చెయ్యనట్లు ....
నా వారు కానట్లుండటం .... కూడా
ఒంటరితనమే

సమూహం లో
ఉన్నంత మాత్రాన
ఒంటరిని కానట్లు కాదు ....
నా ఉద్దేశ్యం లో
సమీపం లో
ఏ స్నేహితులూ
ఏ ఆత్మీయులూ
లేకపోవడం కూడా


నేను ఒంటరినే
వచ్చినప్పుడు,
ఇప్పుడూ
పోయేప్పుడు .... కూడా
డబ్బు ఎంతున్నా
పరపతి ఎంతున్నా
ఒంటరినే నేను

Monday, December 8, 2014

ప్రేమను కోల్పోయి....


ఎవరి అనురాగం ఆలోచనల లోనో
స్థానం కోల్పోయి 
ఉత్తమ స్నేహాన్ని కోల్పోయినప్పుడు
అనిపిస్తుంటుంది.
అంతా శూన్యం లా అనిపిస్తుందేమిటీ
ప్రేమను కోల్పోయానేమో అని.
నిజమైన ప్రేమను కోల్పోవడం
నిజంగా సాధ్యమా!?
నిజంగా అది ప్రేమను కోల్పోవడమా?
లేక అది పరిక్షా సమయమా?
 
ఆరంభం లో
మనసు పంచుకుని మాట్లాడాల్సిన చెలి
ఆర్ద్రంగా పలికినా, ఒత్తి ఒత్తి పలికినా
పక్కనే ఉండీ పట్టనట్లు మాట్లాడనప్పుడు,
వినాలనుకోనప్పుడు .... ఏర్పడే రోషం
నొప్పిని చెప్పుకోలేక, భయాన్ని విడమర్చనూ లేక
ఆ శీతల రాత్రుల జీవితం
దుర్భరం భారమై కరగక .... ఉదయాన్నీ కోరుకోలేక
కాలాన్ని ద్వేషిస్తూ .... దశ దిశ గమ్యం లేని
భవిష్యత్తు పై ఆశను పట్టింపును కోల్పోయి

చిన్న చిన్న సంఘటనలకూ
చిరు అలజడులకూ స్పందించే హృదయం
ఇంతటి ఆకశ్మిక సంఘటన తాకిడికి
అల్లాడక, ఉల్లాసాపడక .... నిరాసక్తంగా
కళ్ళలో .... దయ, కరుణ, అనురాగం కోల్పోయి
నిర్లిప్తత, నిరాపేక్షతతో నిండిపోయి 
అకారణంగా కారుతూ .... కన్నీళ్ళు
నమ్మలేని సంఘటనలు నిజాలు ఐనా,
కళ్ళముందు ప్రపంచం కుప్పకూలినా 
ఆశ్చర్యపోక 


ఇంతటి అసాధారణ నష్టం వాటిల్లినా
ఆ క్షణాల్నీ, లక్షణాల్ని .... సంగటనల్ని
స్వీయ వైఫల్యం
విధి వైఫల్యం అనుకోలేక
ఏమీ పట్టనట్లు ఉండగలుగడం
ఏ కల, ఏ ఆశ నెరవేరని
ఏ గమ్యమూ లేని స్థితి లో ఊగిసలాడడం
ఏ ప్రాణికైనా ఎలా సాధ్యమా అనిపించేలా

ఏ పరిక్షను ఎదుర్కోలేని ప్రేమలా ....
ఔను, పరిక్షలో నెగ్గని ప్రేమ
అది ఓటమిని అంగీకరించలేని ఉమ్మదం సమయం.
ఓటమిని, కోల్పోవడం గా భావించడం
అవిజ్ఞత పలాయనం అనిపిస్తుంది.
అమరం అని చెప్పుకునే
ప్రేమకు నిజంగా ముగింపు ఉంటుందా!?
ప్రేమ బహుమానమే అయితే .... న్యాయమా!?
బలవంతంగా పొందాలనుకోవడం

Saturday, December 6, 2014

కుశలమా అందమా!?


ఓ అనాఘ్రాతపుష్పమా!
రంగు రంగుల పరికిణీలో
నిండుగా,
అందంగా ....
చలికాలం, చల్లదనం
గట్టిబడే గుణాత్ముడుని అయిన
నా స్పర్శ
నా సన్నిహితత్వం
మోటుతనంలా తాకిందా .... నిన్ను!
అబాండం! వేస్తున్నావు.
నీ అందం
నీ వికాసం
నీ పరిమళాలను కోల్పోయి
రేకులు రాలి
వడలిపోయి
అస్తిత్వం ప్రాణం కోల్పోయి
నేల రాలావా!
కారణం నేనేనా!?
చిత్రం!
ఎవరి కోసం ఏ నమ్మకం తో
ఆ ఎదురుచూపులు!?
అభియోగమా!?
ఫలితం ఉండదు.
లోకమంతా స్వార్ధపరులు
కఠినాత్ములే .... నాకన్నా
నా నిష్క్రమణ కోసం చూస్తున్నావా!?
సరే, వెళ్ళిపోతాను.
ఆ సూర్యుడు వెచ్చదనం
ఆగమనం కోసమా .... ఆ నిరీక్షణ
ఆ రవి కిరణాలు
సూటిగా చెరే క్షణాల కోసమేనా!
నిజం గా మళ్ళీ పుడతావా!?
నిండుగా,
అందంగా,
అనాఘ్రాతపుష్పం లా .... పరిమళిస్తావా!?
సరే మరి!
వసంతుడొచ్చి వెళ్ళాక వస్తా
నిన్ను పరామర్శించి స్పర్శించేందుకు!

Wednesday, December 3, 2014

సొంతమైపోవడమంటే .... ఇంతేకదూ!?


నీవు నవ్వుతున్నప్పుడు
పదే పదే చూస్తూ ఉండాలనిపించడం
అతకని అబద్దాలు ఆడి
నీవు దొరికిపోవాలనుకోవడం
నీ సాంగత్యం లో
ఊపిరి బిగబట్టాల్సిన క్షణాలే
అపరిమితంగా ఉండాలనిపించడం 

నీ ఉద్దేశ్యం ఇదీ అని
అర్ధం అయ్యి
నా ఆలోచనల అర్ధం
ఉద్దేశ్యమూ
అదే అవ్వాలనిపించడం
నీవు నాకు నచ్చడం? ....
అపరిమితంగా  


నీ కోరిక ఒకటి తీర్చుతున్నప్పుడు
వేరేదో నీవు కోరాలనుకోవడం
నీవు నన్ను పట్టించుకోనట్లు
అయిష్టాన్ని నటించాలనిపించడం 
నీ ఇష్టానికి వ్యతిరేకం గా
ఎప్పుడైనా
నేను కాబట్టే
ఆపగలను అనిపించడం

ఇంతేనా ....
ఏమో ....
చెప్పవా చెలీ!?
నిజంగా సొంతమైపోవడమంటే ....

Tuesday, December 2, 2014

ప్రేరణ


కాంతి లోపించిన,
చీకటి లో
నన్ను నేను
కనుగొనేందుకు 

వెలుగులా
ఆశా కిరణానివి లా
ఒక ఆవేశం లా ....
నీవు

పోరాట స్పూర్తి,
బలానివై
పురోగమనము, పెరుగుదల
అర్ధానివై 


ముసుగును తొలగించుకుని
రాత్తిరి చీకటి లో .... నేను
వెన్నెల ఆనందాన్ని పొందేందుకు
కారణానివి అయి ....

చెలీ! నీకు ధన్యవాదాలు
నన్నొదలని నీడవై, ఎల్లప్పుడూ
నా వెనుక ఉండి
నన్ను నడిపిస్తున్న ప్రేరణవైనందుకు

విధి వైచిత్రం



ఆత్మ దాహం తీరకుండానే
ఆవిరైపోవడం 
అవయవాలు పాటవాన్ని కోల్పోవడం
మదిలోని అగ్ని చల్లబడటం
వశీకరించబడిన కాఫీ కప్పై .... జీవితం, 


 











కప్పు అంచు తాకి
పెదవులు చురుక్కుమనకపోవడం
కనికరం లేని కాలం
యుగాలుగా చేస్తూ ఉన్న
దోపిడి దొంగతనాలకు ఉదాహరణ .... ?

Monday, December 1, 2014

బాధాక్షరాలు


గుండెను అరచేతిలో పట్టుకుని
గోడల మధ్య ఊపిరిని, లయబద్దతను
ఆమె, విద్వంసం చేసినప్పుడు
మెల్లగా బుగ్గలమీంచి జారిన
ఎర్రటి కన్నీటి బొట్లు
నరకానుభవాన్ని చూపిస్తాయని

అక్కడే అలాగే ఉండిపోక తప్పదని.
ఆ నయగారం హస్తం
పట్టులోంచి తప్పించుకోలేకే ....
ఆమె చేతులు
నా పక్కటెముకలను లోపల నుంచి చీల్చుతున్నా
నిశ్చేష్టుడ్నయ్యానే గాని అని 


ఊహించగలిగిన వారికే అర్ధం అవుతుంది.
అనుభవానికొస్తేనే తెలుస్తుంది.
పువ్వనుకుని
ముల్లును ముద్దాడిన గాయం
ఉదృతమైన బాధాక్షర భావనల అలజడి
మనఃస్థితి నాలో అని