Thursday, January 29, 2015

మరిచిపోయి


కోల్పోయి
లక్ష్యరహితంగా పరిభ్రమించి నీ చుట్టూ ....
శూన్యంలో
ఖాళీ గదిలో
నీ మనస్సులో.
 
ప్రతి రోజూ
అకారణంగా
నిన్ను హింసించి
రాత్రిళ్ళేమో
ఒక భయంకర స్వప్నంలా
నీ నిద్రలో
 
దూరిపోయి
లోలోనికి చివరివరకూ
ఎక్కడికో
ఖాళీ గదిలోకి
తప్పించుకోవడానికి వీలుకానంత
లోతుల్లోకి జారిపోయి


అక్కడే ఉండిపోయి
ఆ అంచుల్లోనే
క్షీణించిపోయి ...
చివరికి ఆ అనుభూతుల్లోనే
గతించిపోయి
మర్చిపోయి నన్ను నేను

Tuesday, January 27, 2015

కాగితంపువ్వు


నీవేమో ఎల్లప్పుడూ నిన్ను నీవు నమ్మాలి
తల వొంచకు అంటూ ఉంటావు.
నేనేమో ఇక్కడ యాచిస్తూ ఉంటాను
తప్పయ్యింది క్షమించవా నన్ను అని 
బలహీనుడ్నై .... నలిగిపోతుంటాను.
నీ మౌనం తో నా బలహీనతే నన్ను నలిపేస్తూ

నాకు ఎప్పుడైతే నీ సాన్నిహిత్యం తోడు
అవసరం అనిపిస్తుందో ....
సరిగ్గా అప్పుడే నీవు
నన్నొదిలెళ్ళిపోయేందుకు నిర్ణయించుకుంటావు
ఒంటరినిచేసి .....
చీకటి పొదిగిన మద్యం కన్నీళ్ళతో నన్ను

మిగిలి ఉన్న కొద్ది ఓపిక తోనే
కాపాడుకోవాలని పోరాడుతున్నాను
జీవితమనే ఏ ముగింపూ
ఏ గమ్యమూ లేని ఈ రహదారిలో
ముందుకు కదల లేకపోతున్నాను.
నా ఉనికి, నా నీడే నన్ను మ్రింగివేస్తూ

దరిలో ఉన్నావేమో అని ఆశగా
నీకోసం వెనుదిరిగి చూస్తే అక్కడ నీవుండవు.
నా మది నిన్నూ నీ జ్ఞాపకాలనూ
తాగేసి మిగిల్చిన ఈ ఖాళీ సీసా చెబుతుంది.
నేను జీవితం లో
మరొకసారి ఘోరంగా విఫలమయ్యానని


అప్పుడప్పుడూ ఈ హృదయం, ఆత్మ
నన్ను నమ్మించే ప్రయత్నం చేస్తుంటాయి.
నయమైపోతున్నట్లు,
కానీ, లోలోన మరణిస్తూ, విశ్రమించాలనిపించినప్పుడు 
రాతి హృదయమేదో
గుసగుసలాడుతుంటుంది .... భద్రం జీవితం అంటూ

ఆశాజనక కారణం కాని
ఈ ద్రవ వైరాగ్యప్పువ్వు, నా ప్రేమ ఇక పరిమళించదని
జీవితాన్ని మరోకోణంలొంచి చూడలేనని తెలిసీ
బలాన్ని కూడగట్టుకుంటున్నా
బాధనంతా ఏడ్చి ఈ రాత్తిరైనా,
కలలోనైనా .... పలుకరింపునై నిన్ను కలవలేనా అని

Wednesday, January 7, 2015

అద్భుత అనుభూతి


ఆవృతమైన ఆకర్షణే
నీవులా
దూరంగా ఆకాశం లో
ఉండీ లేక .... బలహీనపడుతూ
అంతా నీవై .... కమ్ముకుపోతూ
అలజడి సృష్టిస్తూ,
నా మదిలో ....
ఏదో పోలిక 


దూరంగా ఉండీ
ఫ్లయిట్లో ప్రయాణిస్తున్నట్లు,
నిన్ను చూస్తేనే చాలు
వింత ఆనందం, తన్మయం
నీ పక్కనే ఉన్నట్లు ....
కానీ,
స్పర్శించలేను, పొందలేను.
కరుకుగానూ కవ్విస్తూనూ సాగే
దూది మబ్బువి 
నీ పరామర్శ
ఒక వింత అనుభూతి నాకు .... !

నీడే లేకపోతే


తట్టుకోలేము, కొనసాగించలేము జీవితాన్ని ....
ఎవరమూ
నరకతుల్యం ఈ సంసారం
బాధలూ, సంతోషాలూ కలిసి పంచుకునేందుకు
ప్రేమించేందుకు 
నేనున్నాననే తోడు ఎవరూ లేకపోతే

Thursday, January 1, 2015

కళ్ళుమూసుకుపోయి ....


అప్పుడప్పుడూ అర్ధరాత్రిళ్ళలో
పగటి కలలు
ఎవరి నీడలోనో నడుస్తూ
గ్రహణం పట్టినా పట్టనట్లు నటిస్తూ
అంతరంగంలో మాత్రం
భయవిహ్వలుడ్నై
రాజకీయ రణగొణుల
స్వార్ధ దౌర్జన్య 
దోపిడికి కారణాన్ని ....
సహిస్తూ, మోస్తూ 
కాసింత
కుల మత వర్గ పక్షపాతం తో
ద్వేష బీజాలు నాటుకుంటూ  
నాలో ....
నన్ను నేను కోల్పోయి, 


ఒంటరిగా ....
ఒక్కోసారి మరిచిపోయి
వికాసం వెలుగు
ప్రత్యామ్నాయాలకు కారణం
నేనూ,
నాలోని ఆవేశమే అయి ఉండీ
ఎవరో రావాలన్నట్లు
ఎవరి కోసమో ఎదురు చూస్తూ
అర్ధరాత్రిళ్ళు పగటికలలు కంటూ
పవ్వళిస్తూ ....
మురుగు గుంట పరిమళాలలో

జీవ రహదారి లో


సామాజిక న్యాయమే లక్ష్యంగా
ఉత్పత్తి, వికాసం ఆలోచనలతో చేసే సహజీవనం
ఒక వరం .... ఎంతో ఉన్నతం
మరణాన్ని కూడా ....
ఆనందంగా ఆహ్వానించగలిగే జీవ గమనం
ప్రాణం పోసుకున్న ప్రతి ప్రాణీ మరణించకతప్పదు. అయితే
జీవన మార్గం లో పర ఉపయోగం కావడంలోని
ఆనందాన్ని కొందరు మాత్రమే గ్రహిస్తారు.

నిజమైన సహకారం ప్రేమ అంటూ ఒకటుందని
అందరిలోనూ అతి కొద్ది మందికే తెలుస్తుంది.
నా చెలివైన నీపట్ల నా ప్రియ మనో భావన లా 
ప్రియ భావన, ప్రేమంటే ఏమిటో .....
అప్పుడు, ఒక్క శ్వాసను కూడా ఎవ్వరూ
వృధా చేసుకోలేరు .... సాధ్యం మేరా
ప్రేమను గౌరవించి పోషణ భారం వహిస్తారే తప్ప
పరోపకారంలోని తృప్తిని ఆస్వాదిస్తారే తప్ప


ఒక జీవితకాలపు, ఒక సాధారణ లక్ష్యం లా
ఒకరి ఆఖరి శ్వాసలో ఇంకొకరి ఆఖరి శ్వాస భాగమైనట్లు
చివరకు శ్వాసే ఆవిరైపోయే వేళ
ఆ చివరి నిశ్వాసలే అత్యుత్తమ క్షణాలుగా భావించుకుంటూ
సంసారం వేదికగా జీవ బంధాలు పెనవేసుకున్నట్లు 
మరణం అంచువరకూ మనిషి మరో మనిషితో
కలిసి చేసే ప్రయాణం లో భాగస్వామ్యం అనుకుంటూ
సహజీవనం ద్వారా జీవన ప్రమాణాలను పెంచుతూ
సామాజిక న్యాయ పరిమళాలను వెదజల్లుతూ ఉన్నతంగా